Ghaziabad: ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ గుండెపోటుతో యువకుడి మృతి

Ghaziabad: ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ గుండెపోటుతో యువకుడి మృతి
ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌లోని జిమ్‌లో ఘటన

జిమ్‌లో మరో యువకుడు మరణించిన ఘటన తాజాగా ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. సిద్ధార్థ్ అనే యువకుడు వ్యాయామశాలలో ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ గుండెపోటుకు గురయ్యాడు. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతున్న అతడికి గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు.

యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ట్రెడ్ మిల్‌పై పరిగెడుతున్న 21 ఏళ్ల యువకుడు క్షణాలవ్యవధిలో స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. పక్కనే ఉన్న వారు వెంటనే స్పందించి అతడ్ని తట్టిలేపే ప్రయత్నం చేసినా యువకుడిలో కదలికలు రాలేదు. ఆ తరువాత ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. సిద్ధార్థ్ సింగ్ నోయిడాలోని ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నోయిడాలోనే తన తండ్రి వద్ద ఉంటున్నాడు. అతడి తల్లి బీహార్‌‌లో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆ దంపతులకు సిద్ధార్థ్ ఒక్కడే సంతానం కావడంతో వారి దుఃఖానికి అంతేలేకుండా పోయింది. అంతకు కొద్ది నిమిషాల ముందే సిద్ధార్థ్ తనతో ఫోన్లో మాట్లాడాడంటూ అతడి తల్లి కన్నీరుమున్నీరైంది. యువకుడి మృతదేహాన్ని అతడి తండ్రి తమ స్వస్థలానికి తీసుకెళ్లారు.


పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ హఠాత్తుగా మరణించిన ఘటనలు సర్వసాధారణం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రోజురోజుకూ పెరుగుతున్న ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ముంబైకి చెందిన నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ తన వ్యాయామశాలలో కుప్పకూలి మరణించాడు. అంతకు ముందు ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ కూడా వర్కవుట్ చేస్తూ మరణించారు. వీరిద్దరూ ట్రెడ్‌మిల్‌పై పని చేస్తుండగానే ఛాతీలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయారు.

ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే ట్రేడ్ మిల్ లేదా ఏదైనా కార్డియో ఎక్సర్‌‌సైజ్ ఒకసారికి 10 నిమిషాల కంటే ఎక్కువ పొరపాటున కూడా చేయకూడదు. ప్రతి కార్డియో ఎక్సర్‌సైజ్ తరువాత 2-5 నిమిషాలు విరామం అవసరం. దీనివల్ల గుండెకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. డాక్టర్ లేదా ట్రైనర్ సలహా మేరకు వర్కవుట్స్ సమయం నిర్ణయించుకోవాలి. అవసరానికి మించి వ్యాయామం మంచిది కాదు. సాధారణంగా 30 నిమిషాలు చాలని అంటారు. ఛాతీ ఎడమభాగంలో ఏదైనా నొప్పిలా అన్పిస్తే వెంటనే వ్యాయామం ఆపేయాలి. వైద్యుడిని సంప్రదించాలి.

Tags

Read MoreRead Less
Next Story