Face book love: ఫేక్ బుక్ ప్రేమ

కొంతకాలం క్రితం వరకు మగాళ్లు వట్టి మాయగాళ్లు అన్న మాట విని అదే నిజం అనుకున్నాం. ఎందుకంటే అలాంటి ఉదంతాలే చోటుచేసుకునేవి. తాజాగా ఆ పరిస్థితి మారింది. మాాయ లేడిలు కూడా చేతి వాటం ప్రదర్శిస్తున్న వైనం గురించి తెలుసుకుందాం.
ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్ బుక్ లో ఓ మహిళ పరిచయం అయింది. హలోలు, హాయ్ లు, పలకరింపులు అయ్యాక ఏం చేస్తావు అని అడిగాడు హీరో. ఈమధ్యే ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తయింది ప్రస్తుతానికి అండర్ కవర్లో ఉన్నాను అని స్వీట్ గా చెప్పింది ఆమె. ఇక హీరో ఫిదా అయిపోయాడు. ఒక డ్రీమ్ సాంగ్ కూడా పాడేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు.. కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ లో కంప్లైన్ట్ ఇచ్చాడు.
ఇప్పుడు పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళితే
ఆగ్రాలో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న నోబుల్ కుమార్‌కు కల్పనా మిశ్రా ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. కల్పన తనను తాను ఓ అండర్‌కవర్ ఐఏఎస్ గా చెప్పుకుంది. అప్పటికీ కల్పన పోస్టింగ్, ఐఏఎస్ బ్యాచ్ గురించి నోబుల్ కుమార్ ఆరా తీసేందుకు ప్రయత్నించాడు. కానీ అదంతా సీక్రెట్ మిషన్ అంటూ వివరాలు బయట పెట్టలేదు.
తర్వాత ఒకరోజు నోబుల్ కుమార్‌కు పెళ్లి ప్రపోజల్ పెట్టింది. ఓకే చెప్పిన కుమార్ పెళ్లి షాపింగ్ కోసం కల్పనకు రూ.71 వేలు ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఉన్న ఆర్యసమాజ్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. కల్పన ఒక రోజు భర్త ఇంటి నుంచే ఆఫీస్‌కు వెళ్లింది. చక్కగా ఖర్చులకు డబ్బులు కూడా వాడుకుంది. కొన్ని రోజుల తరువాత కనపడకుండా పోయింది.
ఇంటి నుంచి వెళ్లిపోయాక కూడా నోబుల్ కుమార్ నుంచి డబ్బులు తీసుకోవడం మాత్రం ఆపలేదు. దీంతో ఈ సారి మరింత గట్టిగా ప్రయత్నించిన నోబుల్ కుమార్ కు కల్పన చిప్పినందంతా కల్పితమే అని తెలిసింది. అప్పటికే వివాహిత అయిన కల్పన యూపీలోని మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అధికారిణిగా నటిస్తూ కొందరిని మోసం చేసిందని, ఐఏఎస్ అని చెప్పి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిసింది. పేరే కాదు ఆమె జీవితం అంతా కల్పనే అని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాలిపై జాదీష్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పలు ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం ఆమెను పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com