Delhi: పుట్టినరోజు నాడే కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య..!

Delhi:  పుట్టినరోజు నాడే కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య..!
X
ఢిల్లీలో దారుణం

పుట్టినరోజు కావడంతో ఓ యువకుడు బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మరో యువకుడు బైక్‌పై వచ్చి వారి కారును గుద్దడంతో గొడవ జరిగింది. గొడవ పెద్దదిగా మారడంతో బైకర్‌, అతని స్నేహితులు బర్త్‌డే జరుపుకుంటున్న యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. దేశ రాధాని ఢిల్లీ లోని ఘాజీపూర్‌ లోగల పేపర్‌ మార్కెట్‌ ఏరియా లో ఈ హత్య జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. వికాస్‌ అనే యువకుడు ఓ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే పెళ్లి కూడా నిశ్చయమైంది. పైగా బుధవారం అతడి పుట్టినరోజు కూడా. దాంతో బుధవారం విధులు ముగియగానే స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. పార్టీ అనంతరం తన క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన సుమిత్‌తో కలిసి మరోసారి లిక్కర్‌ షాపుకు వెళ్లారు. ఆ లిక్కర్ షాపులో మద్యం తీసుకుని షాపు ముందే రోడ్డు పక్కన కారులో మద్యం సేవిస్తున్నారు.

అదే సమయంలో మద్యం కోసం వచ్చిన మరో యువకుడు వారి కారును గుద్దుకుంటూ వెళ్లాడు. కారుకు గీతలు పడటంతో వికాస్‌ అతడితో గొడవకు దిగాడు. ఆ గొడవ ఇద్దరూ బూతులు తిట్టుకునే వరకు వెళ్లింది. దాంతో అవతలి వ్యక్తి తన మిత్రులకు ఫోన్‌ చేశాడు. దాదాపు ఆరుగురు వ్యక్తులు వచ్చి.. వచ్చీరావడంతోనే వికాస్‌, సుమిత్‌లపై ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగక వికాస్‌ను కత్తులతో పొడిచారు.

దాంతో వికాస్‌ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన సుమిత్‌ను ఘాజీపూర్‌లోని లాల్‌ బహదూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వికాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్‌ చేశారు.

Tags

Next Story