ప్రాణం తీసిన పదిరూపాయలు

పది రూపాయల ఇమ్మని అడిగిన కొడుకు ప్రాణం తీసాడు ఓ తండ్రి. తాగిన మత్తులో కుమారుడిని ఊపిరాడకుండా చేశాడు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పిల్లలకు కష్టం వస్తే తల్లిదండ్రులకే చెప్పుకుంటారు. ఏదైనా కావాలన్నా కూడా వారినే అడుగుతారు. అలా అడగటమే ఆ పిల్లాడి పాలిట శాపం అయిపోయింది. మద్యం మత్తులో ఉన్న తండ్రిని 12 ఏళ్ల కొడుకు పది రూపాయలు అడిగాడు. దీంతో ఆవేశం లో ఉన్న ఆ తండ్రి కొడుకుని విచక్షణా రహితంగా కొట్టి చంపేసాడు.
వివరాలలోకి వెళితే
జార్ఖండ్ ఛత్రా జిల్లాలోని వశిష్ట్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరేలీబర్ గ్రామంలో బిలేశ్ భుయాన్, భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు కుమార్‌తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కూలి పనులు చేస్తూ బిలేశ్ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యం సేవించే అలవాటు ఉన్న బిలేశ్, అతని భార్య సోమవారం ఉదయం 9 గంటలకే ఫుల్లుగా మద్యం తాగి గొడవ పడ్డారు. సరిగ్గా అదే సమయానికి కుమారుడు పప్పు కుమార్ తండ్రిని ఓ పది రూపాయలు ఇవ్వమని కోరాడు. ఐతే అప్పటికే ఆవేశంలో ఉన్న భుయాన్ నీకు డబ్బులు ఎందుకుంటూ కొడుకుపై మండిపడ్డాడు.
విచక్షణ కోల్పోయి, ఆగ్రహంతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అదే సమయానికి ఇటుక బట్టీలో పనిచేసే కూతురు ఇంటికి వచ్చింది. విగత జీవిగా ఉన్న తమ్ముడిని చూసి పెద్దగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వచ్చిచూడగా బాలుడు అక్కడిక్కక్కడే ప్రాణాలు లేకుండా పడివున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తండ్రిని అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com