UP: సినిమా తరహాలో స్కెచ్.. పగతో 10 ఏళ్ల తర్వాత హత్య..

UP: సినిమా తరహాలో స్కెచ్.. పగతో 10 ఏళ్ల తర్వాత హత్య..
X
వీడిన లక్నో మర్డర్ కేసు మిస్టరీ

రీల్ జీవితానికి.. రియల్ జీవితానికి చాలా తేడా ఉంటుంది. సినిమాలో చూపించినట్టుగా.. నిజ జీవితంలో కూడా చేస్తే జీవితాలు బుగ్గిపాలవుతాయి. సినిమా అనేది వినోదం. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని మెప్పించేందుకు ఏవేవో చూపిస్తారు. అందులో వాటిని పాలైతే మాత్రం కటకటాల పాల్వడం ఖాయం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? యూపీలో అచ్చం సినిమా తరహాలోనే ఒక హత్య జరిగింది.

పదేళ్ల క్రితం తల్లిని అవమానించినప్పుడు ఆ పిల్లలు చిన్నవాళ్లు. కానీ మైండ్‌లో ముద్ర పడిపోయింది. తన తల్లిని కొట్టి.. అవమానించిన వ్యక్తిపై పగ తీర్చుకోవాలని ఎప్పుటినుంచో ప్రణాళికలు రచిస్తున్నాడు. ప్రతీకారం కోసం ఎదురుచూస్తుండగా 10 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి కనిపించాడు. చంపేందుకు తన శక్తి సరిపోకపోవడంతో స్నేహితుల సాయం కోరి మరీ చంపేశాడు. మూడు నెలల క్రితం లక్నోలోని కల్యాణ్‌పూర్‌లో జరిగిన హత్య కేసులో నిందితులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

10 ఏళ్ల క్రితం మనోజ్ అనే వ్యక్తి సోను కశ్యప్ తల్లిని కొట్టి.. అవమానించాడు. అప్పుడు సోను చిన్నపిల్లాడు. అయితే తన తల్లిని కొట్టిన వ్యక్తిపై పగతో రగిలిపోతున్నాడు. పదేళ్ల నుంచి మనోజ్ కోసం వెతుకుతున్నాడు. మూడు నెలల క్రితం నగరంలోని మున్షిపులియా ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడు. అంతే అప్పటినుంచి చంపేందుకు సోను స్కెచ్ గీస్తున్నాడు. ధైర్యం సరిపోక.. పెద్ద పార్టీ ఇస్తానంటూ స్నేహితుల్ని ఉసిగొల్పాడు. అంతే మనోజ్‌ను చంపేందుకు సై అన్నారు. మనోజ్.. కొబ్బరినీళ్లు విక్రయిస్తుంటాడు. మే 22న కొబ్బరినీళ్లు అమ్మి తిరిగి ఇంటికి వస్తుండగా సోను బృందం రాడ్లతో విరుచుకుపడ్డారు. చనిపోయాడని పారిపోయారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోజ్ చనిపోయాడు.

హత్య జరిగిన తర్వాత సీసీటీవీలో నారింజ రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి ఫొటో రికార్డైంది. అయితే సోను.. తన స్నేహితులకు పార్టీ ఇచ్చిన తర్వాత ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పటికే నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు సోషల్ మీడియాలో కనిపించిన ఫొటోలకు నిందితుడు షర్ట్ సరిపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కుట్ర బయటకు వచ్చింది. నిందితులు సోను, రంజీత్, ఆదిల్, సలాము, రెహ్మత్ అలీగా గుర్తించి అరెస్ట్ చేశారు. తల్లిని అవమానించాడనే మనోజ్‌ను సోను చంపేశాడని పోలీసులు తెలిపారు.

Tags

Next Story