Uttar Pradesh: బుర్కా వేసుకోలేదని భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలను కడతేర్చిన భర్త

Uttar Pradesh: బుర్కా వేసుకోలేదని భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలను కడతేర్చిన భర్త
X
ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో అమానుష ఘటన

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో ఓ సంచలనకర ఘటన వెలుగులోకి వచ్చింది. కాంధ్లా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గఢీ దౌలత్ గ్రామంలోని ఓ కుటుంబ కలహాలు చివరకు భయంకర మలుపు తీసుకుంది. బుర్కా వేసుకోవడాన్ని నిరాకరించిందన్న కారణంతో భర్త తన భార్యను కాల్చిచంపి, ఇద్దరు మైనర్ కుమార్తెలను కూడా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముగ్గురి మృతదేహాలను ఇంటి ఆవరణలో ముందుగానే తవ్వించిన సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టినట్లు తేలింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడి పేరు ఫారుక్. అతడు ఓ హోటల్‌లో రోటి మాస్టర్. తండ్రి, సోదరుల నుంచి వేరుగా నివసిస్తున్న ఫారుక్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. భార్య తాహిరా, కుమార్తెలు ఆఫ్రీన్ (16), సహరీన్ (14) బుర్కా ధరించి బయటకు వెళ్లాలని ఫారుక్ ఒత్తిడి తెచ్చేవాడని, దీనికి తాహిరా అంగీకరించకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. ఈ విషయం ఫారుక్ అవమానంగా భావించాడని విచారణలో వెల్లడైంది.

సుమారు 10 రోజుల క్రితం తాహిరా, వారి ఇద్దరు కుమార్తెలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేసిన ఫారుక్ తండ్రి దావూద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫారుక్‌ను విచారించగా మొదట్లో అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు వారి స్టైల్ లో ప్రశ్నించడంతో చివరకు నేరాన్ని ఒప్పుకున్నాడు. విచారణలో ఫారుక్ తెలిపిన వివరాల ప్రకారం.. భార్య, కుమార్తెలు బుర్కా లేకుండా బయటకు వెళ్లడంపై అతడికి తీవ్ర కోపం వచ్చేదని, అదే కోపంతో క్యారానా నుంచి అక్రమంగా తుపాకీ, అందులోకి బుల్లెట్స్ కొనుగోలు చేశాడని తెలిపాడు. ఇంకా ముందు ప్లాన్ ప్రకారం ఇంటి ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ తవ్వించాడు. ఘటన సమయంలో తాహిరా తన పుట్టింట్లో ఉండగా, ఫారుక్ ఆమెను ఇంటికి రమ్మని పిలిచాడు.

డిసెంబర్ 8 రాత్రి చాయ్ తాగుదామని చెప్పి నిద్రలో ఉన్న భార్య తాహిరాను లేపి కాల్చి చంపాడు. ఆ ఘటనలో తుపాకీ శబ్దంతో మేల్కొన్న కుమార్తెల్లో పెద్దదైన ఆఫ్రీన్‌ను కూడా కాల్చి హతమార్చాడు. చిన్న కుమార్తె సహరీన్‌ను గొంతు నులిమి చంపినట్లు పోలీసులకు తెలిపాడు. హత్యల అనంతరం ముగ్గురి మృతదేహాలను సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడు. గ్రామస్తులు, బంధువులను మభ్యపెట్టేందుకు తాను భార్య, పిల్లలతో కలిసి షామ్లీలో అద్దె ఇంట్లో ఉంటున్నానని అబద్ధం చెప్పాడు. అయితే రోజులు గడిచినా తాహిరా, పిల్లల జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యుల అనుమానం బలపడింది. మంగళవారం సాయంత్రం ఫారుక్ సూచనలతో పోలీసులు సెప్టిక్ ట్యాంక్‌ను తవ్వగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. చివరకు ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

Tags

Next Story