Crime: నకిలీ పోలీసు అవతారంలో మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Crime:  నకిలీ పోలీసు అవతారంలో మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
X
వితంతు, భర్తలకు దూరంగా ఉండే మహిళలే టార్గెట్..

ఖాకీ దుస్తుల మాటున ఓ కామాంధుడు సాగించిన అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసునని నమ్మించి, వితంతువులు, ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేస్తున్న ఓ నకిలీ పోలీసు బాగోతం ఉత్తరప్రదేశ్‌లో బట్టబయలైంది. పేరు మార్చుకుని, పోలీసు యూనిఫాం ధరించి మూడేళ్లుగా సాగిస్తున్న ఈ ఘరానా మోసంలో దాదాపు 20 మంది మహిళలు చిక్కుకోగా, వారిలో 10 మందిని లైంగికంగా వాడుకున్నట్టు పోలీసుల విచారణలో తేలడం తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడి అసలు పేరు నౌషద్ త్యాగి. ఇతడు తన పేరును రాహుల్ త్యాగిగా మార్చుకుని ఈ నేరాలకు పాల్పడ్డాడు. సమాజంలో పోలీసులకు ఉండే గౌరవాన్ని ఆసరాగా చేసుకుని, నకిలీ యూనిఫాం, ఐడీ కార్డులతో అమాయక మహిళలను బురిడీ కొట్టించడం ఇతడి నైజం. ముఖ్యంగా భర్తను కోల్పోయిన వితంతువులు, భర్తలకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలనే లక్ష్యంగా చేసుకునేవాడు. వారికి మాయమాటలు చెప్పి, పెళ్లి పేరుతో నమ్మించి, వారి జీవితాలతో చెలగాటమాడాడు.

పలు రాష్ట్రాల్లో విస్తరించిన మోసాల సామ్రాజ్యం

కేవలం 10వ తరగతి మాత్రమే చదివిన నౌషద్.. తన మోసాల సామ్రాజ్యాన్ని ఉత్తరప్రదేశ్‌కే పరిమితం చేయలేదు. ఢిల్లీ, ఘజియాబాద్, బులంద్‌షహర్, మధుర, సంభాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ వరకు తన వల విసిరాడు. తన నటన ఎంత గొప్పదంటే, కొందరు నిజమైన పోలీసు అధికారులతో సైతం స్నేహం చేసి వారిని కూడా నమ్మించగలిగాడు. ఈ క్రమంలో దాదాపు 18 నుంచి 20 మంది మహిళలను మోసం చేసి, వారిలో 10 మందిని లైంగికంగా వాడుకుని వదిలేశాడు.

బాధితురాలి ఫిర్యాదుతో బట్టబయలు

ఎంతటి నేరగాడికైనా కాలం చెల్లుతుంది అన్నట్లుగా, ఓ బాధితురాలు ఇటీవల ధైర్యం చేసి ముజఫర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నయవంచకుడి నాటకానికి తెరపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు, పక్కా ప్రణాళికతో నిందితుడు నౌషద్‌ను అరెస్ట్ చేశాయి. లోతుగా విచారించగా, అతడి నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడింది.

ముజఫర్‌నగర్ ఎస్పీ సత్యనారాయణ ప్రజాపత్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. "నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచాం. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఈ కేటుగాడి చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు" అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story