ఆటోలో గొడవ పడ్డ జంట-ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. కదులుతున్న ఆటోలోనే ఓ వ్యక్తి ప్రియురాలి గొంతు కోసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు వివరాల ప్రకారం బాధితురాలు పంచ్ షీలా జమ్దార్ తన ప్రియుడు దీపక్ భోర్సే తో గత రెండేళ్లుగా రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. సోమవారం దీపక్ ఘాట్‌కోపర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. షీలాఅతన్ని పికప్ చేసుకోవడానికి స్టేషన్‌కి వచ్చింది. దీపక్ ది ఉల్హాస్‌నగర్ కాగా, మృతురాలు చండీవాలిలోని సంఘర్ష్ నగర్‌లో నివసిస్తోంది. వీరిద్దరూ సాకి నాకా వైపు వెళ్లడానికి ఆటో ఎక్కారు. నిజానికి జంట తరచూ పలు విషయాలపై గొడవలు పడుతుండేవారని, వయసులో షీలా పెద్దది కావడంతో షీలా తల్లిదండ్రులు కూడా దీపక్ తో ఆమె బంధాన్ని అంగీకరించకలేదని పోలీసులు తెలిపారు. ఆటోలో వారు ఎప్పటిలాగే గొడవకు దిగారు. అయితే దీపక్ తన జేబులో కట్టర్‌ని తీసి ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాడు.
గొడవ మరింత పెద్దది అవ్వడంతో ఆమె మెడపై ఒక్క వేటు వేశాడు. భయంతో ఆటో ఆపేసాడు డ్రైవర్. దీపక్ ఆటో దిగి పారిపోయాడు. తీవ్ర గాయాలతో ఆమె ఆటో దిగి పరిగెత్తడానికి ప్రయత్నించిందని, కానీ అక్కడికక్కడే పడిపోయి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీపక్ శరీరంపై రక్తపు మరకలు చూసిన కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. సాకి నాకా నుండి పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. బాధితురాలిని రాజావాడి ఆసుపత్రికి తరలించగా, ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పారిపోతున్న దీపక్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే దీపక్ వెంటనే మాట మార్చాడు. తన ఒంటి మీద ఉన్న గాయాలను రుజువుగా చూపిస్తూ, షీలా మొదట దాడి చేసిందని కట్టుకథను చెప్పాడు, అయితే ఆటో డ్రైవర్ సాక్షిగా మారాడు. దీపక్ చేసిన దారుణాన్ని ఆయన కళ్ళకు కట్టినట్టుగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే దీపక్ అసలు ఉద్దేశ్యం ఏమిటి, ఆమెను కలిసేటప్పుడు కట్టర్‌ను ఎందుకు తీసుకెళ్లాడు అనేదానిని తెలుసుకోవడానికి మరింత విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com