5నక్షత్రాల హోటల్ లో 2ఏళ్లు బస... బిల్లుకట్టకుండా పలాయనం

ఫైవ్‌స్టార్ హోటల్... ఈ పేరు వింటేనే సామాన్యుడి గుండె గుభేలు మంటుంది. విలాసవంతమైన అలాంటి హోటల్లో ఒకరోజు ఉండాలన్న సామాన్యులకు అది చాలా కష్టమైన పనే. ఫైవ్ స్టార్ హోటల్లో ఒకరోజు ఉండాలంటే కనీసం లక్ష రూపాయల వరకు ముట్టచెప్పక తప్పదు మరీ. కానీ ఓ నిందితుడు ఏకంగా 603 రోజులు ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండి ఒక్క రూపాయి బిల్లు కట్టకుండా చెక్కేశాడు. ఈ కేటుగాడిపై ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రోజేట్ హౌస్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌కి 2019 మే 30న అంకుశ్ దత్తా అనే వ్యక్తి ఒకరోజు ఉండేందుకు వచ్చాడు. అప్పటినుంచి 2021 జనవరి 22 వరకు అంటే 603 రోజులు అదే ఫైవ్‌స్టార్ హోటల్లో ఉన్నాడు. చివరకు 58 లక్షల రూపాయల బిల్లు చెల్లించకుండా గుట్టుచప్పుడు కాకుండా అక్కడినుంచి తప్పించుకున్నాడు. హోటల్ సిబ్బందిలో కొంత మంది అంకుశ్ దత్తాకు సహకరించినట్లు హోటల్ ప్రతినిధి తెలిపాడు. హోటల్ లాగిన్ సాఫ్ట్‌వేర్, అకౌంట్స్‌లో భారీ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. వాస్తవానికి ఒక వ్యక్తి బిల్లు చెల్లించకుండా తన స్టేను 72 గంటలకు పైగా పొడిగించుకుంటే.. ఆ విషయాన్ని వెంటనే సిబ్బంది హోటల్ సీఈఓ, ఫైనాన్షియల్ కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పై స్థాయికి తీసుకెళ్లలేదని సదరు వ్యక్తి వెల్లడించారు. బిల్లులు చెల్లించేందుకు అంకుశ్ మూడు సార్లు వరుసగా చెక్కులు ఇవ్వగా అవి కూడా బౌన్స్ అయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో హోటల్ ప్రతినిధి పేర్కొన్నారు. నేరం జరిగినట్లు గుర్తించిన పోలీసులు... లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com