Baba Siddique Murder: బాబా సిద్ధిక్ హత్యలో ప్రధాన షూటర్ అరెస్ట్..
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ హత్య దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ హత్యలో ప్రధాన షూటర్ శివకుమార్‌ని ఆదివారం అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్‌లో పట్టుబడ్డాడు. సిద్ధిక్‌ని చంపిన తర్వాత నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), ముంబై క్రైమ్ బ్రాంచ్ జాయింట్ ఆపరేషన్‌లో నిందితుడు పట్టుబడ్డాడు.
బాబా సిద్ధిక్‌ని చంపేందుకు నిందితుడు 9.9 ఎంఎం పిస్టల్ ఉపయోగించాడు. ముంబై బాంద్రా ఈస్ట్‌లోని తన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్టోబర్ 12న కాల్పులు జరిగాయి. మొత్తం 6 రౌండ్ల కాల్పుల్లో అతను మరణించాడు. ఈ కేసులో అప్పటి నుంచి శివకుమార్ పరారీలోనే ఉన్నాడు. తాజాగా ఇతడితో పాటు ఇతడికి ఆశ్రయం కల్పించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో మెంబర్ అని అంగీకరించాడు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని శివ కుమార్ వెల్లడించారు. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడిగా చెప్పబడుతున్న శుభమ్ లోంకర్ అన్మోల్ బిష్ణోయ్‌తో పరిచయాన్ని సులభతరం చేశారని శివకుమార్ పేర్కొన్నాడు. బాబా సిద్ధిఖ్‌పై కాల్పులు జరపడానికి ముందు అతని షూటర్లతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని ముంబై పోలీసులు గతంలో చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com