Supreme Court: ఎన్నికల వేళ మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల మ్యానిఫెస్టోలో తాయిలాలను ప్రకటించే రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మ్యానిఫెస్టోల్లో పొందుపరిచే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని స్పష్టం చేసింది. కర్ణాటకలోని చామరాజ్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ 2023లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడాన్ని సవాల్ చేస్తూ అదే నియోజకవర్గానికి చెందిన ఓటర్ శశాంక జే శ్రీధర కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సాయం చేస్తామని వాగ్దానాలు చేసిందని.. ఇది అవినీతితో కూడిన ఎన్నికల కార్యకలాపం అవుతుందని ఆరోపించారు. దీనిపై హైకోర్టు తీర్పు చెప్తూ, తాము అధికారంలోకి వస్తే, అమలు చేయబోతున్న విధానాల గురించి రాజకీయ పార్టీ చెప్పడం అవినీతి కిందకు రాదని స్పష్టం చేసింది. దీనిపై అప్పీలును సుప్రీంకోర్టు తాజాగా విచారించి డిస్మిస్ చేసింది.
విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు పిటిషనర్ వాదనలను తోసిపుచ్చింది. తాము అమలు చేయాలనుకుంటున్న విధానాల గురించి ఏదైనా పార్టీ ప్రకటించడాన్ని అవినీతిగా పరిగణించలేమని పేర్కొంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 కింద మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని తెలిపింది. వాటిని సంక్షేమ విధానాలుగానే చూడాలని, ఆర్థికపరంగా అవి సరైనవేనా కాదా అనేది వేరే విషయమని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో శశాంక దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారని ప్రశ్నించింది. మేనిఫెస్టోను అవినీతిగా పరిగణించలేమని పిల్‌ను తోసిపుచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com