N Biren Singh: మణిపూర్ సీఎం రాజీనామా

గత రెండేండ్ల నుంచి రావణ కాష్టంగా రగులుతున్న మణిపూర్‌లో అధికార పార్టీ బీజేపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఎన్ బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. సాయంత్రం తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు. ఆయన రాజీనామాను అంగీకరించిన గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని బీరేన్‌ను కోరారు. అయితే ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించేది, లేనిదీ బీజేపీ అధిష్ఠానం వెల్లడించ లేదు.
ఈ పరిణామాల క్రమంలో సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దు చేశారు. కాగా, తన నాయకత్వంపై సొంత పార్టీలోనే ఏర్పడిన అసమ్మతిని చల్లార్చడానికి, సభలో తనపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో బీరేన్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. అయితే బీరేన్ నాయకత్వ మార్పును సొంత పార్టీలోనే పలువురు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఈ సమయంలో సభలో నిర్వహించే విశ్వాస పరీక్షకు పార్టీ విప్ జారీ చేసినా చాలామంది ధిక్కరించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా కేంద్రంతో చర్చించిన తర్వాత బీరేన్ సీఎం పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.
2023లో మేలో మణిపూర్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 250 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేసింది. అల్లర్లను అదుపు చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో హింస సీఎం అనుమతితోనే జరిగిందంటూ ఇటీవల వెలువడిన ఒక ఆడియో క్లిప్‌ను విశ్లేషించి దాని ప్రామాణికతపై ఫోరెన్సిక్ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సుప్రీం కోర్టు గత వారం కేంద్రాన్ని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com