మణిపుర్‌లో అల్లకల్లోల వాతావరణం

మణిపుర్‌లో అల్లకల్లోల వాతావరణం
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో కల్లోల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి

జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో కల్లోల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఘర్షణ మొదలవుతుందో తెలియని తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్వక్తా, కాంగ్వై ప్రాంతాల్లో ఘర్షణ జరిగింది. దీంతో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు భారీ సంఖ్యలో గుంపుగా ఏర్పడటం, విధ్వంసానికి యత్నించడం వంటి పలు ఘటనలు జరిగాయని అధికారులు తెలిపారు.

స్థానిక అడ్వాన్స్‌ హాస్పిటల్ సమీపంలోని ప్యాలెస్ కాంపౌండ్‌ వద్ద ఒక మూక నిప్పంటించడానికి ప్రయత్నించింది. ఆ మూకలో దాదాపు వెయ్యిమంది వరకు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించాయి. మణిపుర్‌ విశ్వవిద్యాలయం సమీపంలో, తొంగ్జు ప్రాంతంలోని ఓ ఎమ్మెల్యే ఇంటి వద్ద వందల మంది గుమిగూడి ఇదే తరహాలో దాడికి యత్నించారని వెల్లడించారు.

అలాగే మరో 300 నుంచి 400 మంది గుంపుగా వచ్చి ఇంఫాల్ సమీపంలోని ఇరింగ్‌బామ్ పోలీస్‌ స్టేషన్‌లోని ఆయుధాలను లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. అక్కడి వారికి ఎలాంటి ఆయుధాలు లభ్యం కాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి ఇంటివద్ద, బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకారులు ఈ తరహాలోనే విధ్వంసం సృష్టించాలని చూశారని అధికారులు తెలిపారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాపిడ్ యాక్షన్‌ ఫోర్స్, రాష్ట్ర పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ దాడుల్ని భగ్నం చేస్తున్నాయి. అలాగే ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో ఫ్లాగ్ మార్చ్‌ నిర్వహించాయి.

ఇటీవల రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కేంద్ర మంత్రి ఆర్‌.కె.రంజన్‌ సింగ్‌ ఇంటిపై మూకదాడి జరిగింది. అలాగే ఓ విశ్రాంత గిరిజన ఐఏఎస్‌ అధికారికి చెందిన గిడ్డంగికి నిప్పుపెట్టారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన ఆర్‌ఏఎఫ్‌తో ఘర్షణకు దిగారు. బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టాయి

Tags

Read MoreRead Less
Next Story