MANIPUR VOILENCE: మణిపుర్‌లో కొనసాగుతున్న హింస

MANIPUR VOILENCE: మణిపుర్‌లో కొనసాగుతున్న హింస
మణిపుర్‌లో మరోసారి కాల్పులు.... రెండు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయన్న పోలీసులు... ఆయుధ లూటికి అల్లరి మూకల యత్నం

ఆందోళనలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస ఆగడం లేదు. తాజాగా బుధవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. రెండు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు వివరించారు. మంగళవారం రాత్రి తొలి ఖోయిజుంతాబి ప్రాంతంలో కాల్పులు జరగగా.. బుధవారం తెల్లవారు జామున 4.30 సమయంలో తూర్పు ఫైలెంగ్‌ ప్రాంతంలో జరిగింది. ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. మణిపుర్‌లోని చాలా పోస్టుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 118 చెక్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 326 మందిని అరెస్టు చేశారు.


నిన్న అల్లరి మూకలు భారీగా ఆయుధ లూటీకి పాల్పడేందుకు విఫలయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ధౌబాల్‌ జిల్లాలో ఇండియన్‌ రిజర్వు బెటాలియన్‌ వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు అల్లరి మూకలు ప్రయత్నించాయి. వీటిని భద్రతా దళాలు అడ్డుకొన్నాయి. వందల సంఖ్యలో అల్లరి మూకలు IRB బెటాలియన్‌ పోస్టుపై దాడి చేశాయి. ఐఆర్‌బీ దళాలకు మద్దతుగా సైన్యం, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఇతర దళాలు రాకుండా అల్లరి మూకలు రహదారులను ముందే తవ్వేశాయి. కానీ, అస్సాం రైఫిల్స్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దళాలు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ముప్పు తప్పింది. వీరు అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు.


మణిపుర్‌ కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దాంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలు ఘర్షణలకు దారితీశాయి. మే 3 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకూ 120 మంది మరణించగా.... 3 వేల మందికిపైగా గాయపడ్డారు. సాయుధ దళాలు పహరా కాస్తున్న.. రెండు నెలలుగా హింస అదుపు చేయడం ప్రభుత్వానికి అసాధ్యంగా మారిపోయింది. మణిపుర్‌ మొత్తం రెండు వర్గాలుగా విడిపోయింది.

ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ సర్కారు మైతీలకు ప్రాధాన్యమిస్తోందని రగిలిపోతున్న కుకీలు శాంతిస్థాపనకు అవాంతరాలు సృష్టిస్తున్నారు. మెజార్టీ సామాజిక వర్గమైన మైతీల్లోనూ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో హింస పెచ్చరిల్లుతూనే ఉంది. ఈ హింసకు ఫుల్‌స్టాప్ పెట్టి.. మునుపటి పరిస్థితులు పునరుద్ధరించేందుకు హోంమంత్రి అమిత్‌షా ప్రయత్నించినా ఆశించిన ఫలితం లభించలేదు. అదుపులేని హింసతో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఆస్తులన్నీ ఆహుతికావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story