మణిపూర్ లో ఆగని మంటలు

మణిపూర్ లో ఆగని మంటలు
కేంద్ర మంత్రి ఇంటికి నిప్పు

మణిపూర్ లో హింసకాండ కొనసాగుతూనే ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగం లోకి దిగి చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం మణిపూర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నెంచ్చా కిపీజెన్ అధికార నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు తాజాగా కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటికి నిప్పు అంటించారు. అయితే ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ అతని కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. కొమ్‌గ్‌బా ప్రాంతంలోని సింగ్ ఇంఫాల్ నివాసం మంటల్లో పాక్షికంగా దెబ్బతిన్నదని, అతని నివాస సముదాయంలోని కొన్ని తాత్కాలిక నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయని అధికారిక వర్గాలు తెలిపాయి. రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.

అసలు ఈ ఆందోళనలు ఎందుకంటే:

మణిపూర్ రాష్ట్రంలో మీటీ, కుకీ, నాగా అనే మూడు ప్రధాన తెగులున్నాయి. వీటిలలో ఎక్కువ మంది హిందువులు కాగా కొంతమంది ముస్లింలు కూడా ఉన్నారు. వీరిని మీటీ పంగల్ గా వ్యవహరిస్తారు. హిందూ మీటీలతో పాటుగా తమకి కూడా ఎస్టీ హోదా కావాలని వీరు 2012 నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇక కుకీలు, నాగాలలో అత్యధికులు క్రైస్తవులు. వీరంతా పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తారు.ఎస్టీ జాబితాలో ఉన్నారు. మీటీలలో అత్యధికులు ఓబీసీ లో ఉండగా కొందరు మాత్రం ఎస్సీ లుగా ఉంటున్నారు. అయితే రాజకీయాల్లో మీటీలదే ఆధిపత్యం కావడంతో మీటీలు, కుకీల మధ్య సయోధ్య కొరవడింది. మీటీలు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ చేస్తున్న ఉద్యమంతో ఈ అగాధం పెరుగుతూ వచ్చింది.

మణిపూర్ హైకోర్టు కూడా ఈ డిమాండ్ ను కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా తీర్పించింది. దీంతో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ సంస్థ, మే మూడవ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీటీ తెగ ప్రజలపై దాడికి పాల్పడ్డారు. దీంతో పలు ప్రాంతాలలో మీటీలు ప్రతిదాడులు చేశారు. దాడులు, ప్రతిదాడులతో నెల రోజులుగా మణిపూర్ అట్టుడికి పోతోంది. రోజుకో ఘర్షణ, దాడులు జరుగుతుండటంతో అభం శుభం తెలియని అమాయకులు సైతం బలైపోతున్నారు. మే 3 నుండి కుకీ మరియు మెయిటీ కమ్యూనిటీలకు చెందిన 100 మందికి పైగా మరణించారు. 50,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.

అయితే మణిపూర్ విషయంలో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్‌ హింసపై ప్రధాని మోదీ ఇప్పటివరకూ స్పందించలేదని విమర్శిస్తున్నాయి. బీజేపీ స్వార్థ రాజకీయమే జాతుల మధ్య రిజర్వేషన్‌ చిచ్చు రాజేసిందని ఆరోపిస్తున్నాయి. మణిపూర్‌ హింసకు మోడీ సర్కార్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story