Matsya 6000: సముద్రం గుట్టు విప్పనున్న ‘మత్స్య 6000

భారత్‌ మరో అద్భుతానికి శ్రీకారం

సముద్రగర్భంలో సాహస యాత్రకు రంగం సిద్ధమవుతోంది. మనదేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ఠ లోతు 6 వేల మీటర్లు. అంతకు మించి 7,500 మీటర్ల మేర లోతుగా వెళ్లేంత సామర్థ్యమున్న మానవ సహిత సబ్‌మెర్సిబుల్‌ వాహనాన్ని పంపాలనేది భారత్‌ లక్ష్యం. భూ ఉపరితలంతో పోల్చితే అక్కడ 750 రెట్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కార్లు తదితర వాహనాలు అక్కడ 20 మిల్లీ సెకన్లలోనే నుజ్జయిపోతాయి. పైగా 2 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుంది. అంతటి తీవ్రతను తట్టుకునేలా ప్రత్యేకంగా టైటానియం మిశ్రమ లోహంతో ఈ వాహనాన్ని తయారు చేస్తున్నారు. సముద్రం లోపల 100 మీటర్ల తర్వాత ఎలాంటి విద్యుదయాస్కాంత తరంగాలు గానీ.. రాడార్, జీపీఎస్‌ గానీ పనిచేయకపోవడంతో పరిశోధనల కోసం నేరుగా వెళ్లేందుకు ఈ వాహనాన్ని తయారుచేస్తున్నారు.

ప్రపంచంలో ఏ మానవసహిత సబ్‌మెర్సిబుల్‌కు కూడా పూర్తిస్థాయిలో అధికారిక ధ్రువీకరణ లేదు. తొలిసారిగా ‘మత్స్య 6000’ ఈ రికార్డును సాధించే దిశగా వెళ్తోంది. నార్వేలోని డీఎన్‌వీ సంస్థ దీన్ని ధ్రువీకరిస్తోంది. డిజైన్లు, పరికరాలు, విడిభాగాలు విడతలవారీగా పరీక్షిస్తున్నారు. ఏడాది కిందట సముద్రగర్భంలో టైటానిక్‌ ఓడను చూసేందుకు వెళ్లి ఓషన్‌ గేట్ సంస్థకు చెందిన సబ్‌మెర్సిబుల్‌లో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌ఐఓటీ మరింత అప్రమత్తమైంది. అలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి విడిభాగానికీ ధ్రువీకరణ పొందేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

పైలట్, ఇద్దరు శాస్త్రవేత్తలు కూర్చునేందుకు వీలుగా తయారుచేసే 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాకార గృహం (స్పియర్‌) ఈ పరిశోధనలకు అత్యంత కీలకమైంది. ఇక్కడి నుంచే వాహనాన్ని నియంత్రించే వ్యవస్థ ఉంటుంది. 5 టన్నుల బరువుండే ఈ వాహనాన్ని తేలికైన టైటానియం మిశ్రమ లోహంతో చేశారు. సముద్రగర్భంలోకి వెళ్లడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలతో పాటు పరిశోధన కోసం 6 గంటలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. వ్యవస్థలు విఫలమైనా నీటిలోనే 96 గంటలు ఉండేలా 67 ఆక్సిజన్‌ సిలిండర్లను ఇందులో ఉంచారు. కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించే సాధనాలూ ఉంటాయి.

వచ్చే ఏడాది సెప్టెంబరు-డిసెంబరు లోపు ట్రయల్స్‌ పూర్తిచేసుకుని వాహనాన్ని సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజాగా పదవీ విరమణ పొందిన ఎన్‌ఐఓటీ డైరెక్టర్, తెలుగువారైన డాక్టర్‌ జి.ఎ.రామదాస్‌ చెబుతున్నారు. అందుబాటులోకి వచ్చిన విడి భాగాలతో 500 మీటర్ల లోతు దాకా మొదట మానవరహితంగా వెళ్లేలా వాహనాన్ని తయారుచేస్తున్నారు. చెన్నై హార్బర్‌ నుంచి ఈ ఏడాది సెప్టెంబరు లోపు ప్రయోగం చేయనున్నారు. తొలుత మనుషుల్లేకుండా పంపడం, ఫలితాల్ని అనుసరించి మనుషులతో ట్రయల్‌రన్‌ నిర్వహించడం వంటివి చేయనున్నట్లు వివరించారు. 2026 నుంచి పరిశోధనలు మొదలవుతాయని తెలిపారు. ప్రస్తుతం ఈ వాహనం ప్రాజెక్టు డైరెక్టరుగా ఎస్‌.రమేష్‌ కొనసాగుతుండగా, ఎన్‌ఐఓటీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా తెలుగువారైన టి.శ్రీనివాసకుమార్‌ వ్యవహరిస్తున్నారు.

Tags

Next Story