Central Cabinet: కేంద్ర మంత్రుల బాధ్యతల స్వీకరణ

పలువురు కేంద్ర మంత్రులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. హోం, విదేశాంగ, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులు అమిత్ షా, జైశంకర్, నడ్డా, అశ్విని వైష్ణవ్ సహా ఇతర మంత్రులు పూజా కార్యాక్రమాల అనంతరం ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో ఆసీనులయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జైశంకర్ మాట్లాడుతూ ‘భారత్ ఫస్ట్, వసుదైక కుటుంబం’ అనేవి దేశ విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలుగా ఉంటాయని అన్నారు. పార్లమెంట్ సజావుగా నడిచేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా పనిచేస్తానని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి బాధ్యతల స్వీకరణ అనంతరం అన్నారు.
ఈ మంత్రివర్గంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారిలో మొత్తం 7 మంది మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఎంబీఏ చదివారు. ప్రధాని మోదీ బృందంలో మొత్తం 68 మంది మంత్రులు పట్టభద్రులు ఉన్నారు. ఇప్పటికే పరిపాలనలో అనుభవం సంపాదించిన ఏడుగురు బ్యూరోక్రాట్లు ఇప్పుడు మంత్రులుగా మారి దేశ ప్రజలకు సేవ చేయనున్నారు.
అయితే ఈసారి కొన్ని చిన్నా పెద్దా మార్పులు కనిపించాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వ్యవసాయ శాఖ బాధ్యతలు దక్కగా, ఆ బాధ్యతలను నరేంద్ర సింగ్ తోమర్ చివరిసారిగా నిర్వహించారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు వెళ్ళింది. అతను మొదటిసారి మంత్రి అయ్యారు. గతసారి విద్యుత్, పట్టణ మంత్రిత్వ శాఖ ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పూరీల వద్ద ఉంది. అయితే వారసత్వ రాజకీయాలు, వారసత్వ పాలన అంటూ విపక్ష పార్టీలపై పదేపదే విమర్శలు గుప్పించే ప్రధాని మోదీ.. కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాబినెట్‌లో అదే వారసత్వ నేతలకు పెద్ద పీట వేశారని విమర్శలు వచ్చాయి . కొత్త క్యాబినెట్‌లో మంత్రి పదవులు చేపట్టిన వాళ్లలో చాలా మందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నది. ఈ జాబితాలో హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్ రిజిజు, జయంత్ చౌదరి, జ్యోతిరాదిత్య సింధియా, చిరాగ్ పాశ్వాన్, పీయూశ్ గోయల్ తదితరులు ఉన్నారు. కేంద్ర క్యాబినెట్‌లో మరోసారి మంత్రి అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి జయశ్రీ బెనర్జీ అల్లుడు కావడం గమనార్హం. నూతన కేంద్ర క్యాబినెట్‌ను ‘పరివార్ మండలి’గా కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com