MAOIST PARTY: మాజీ మావోయిస్టుల కొత్త రాజకీయ వేదిక

దేశంలో దశాబ్దాలుగా సాగిన మావోయిస్టు ఉద్యమం ఉనికి కోల్పోయింది. ఒకప్పుడు సాయుధ పోరాటానికి నేతృత్వం వహించిన అగ్ర మావోయిస్టు నేతలు, ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. సమాజ మార్పు కోసం తుపాకీ కాదు, బ్యాలెట్‌నే ఆయుధంగా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, లొంగిపోయిన మావోయిస్టు నేతల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల సమస్యలు, గిరిజనుల హక్కులు, భూమి–అడవి–ఉపాధి వంటి అంశాలను రాజకీయ వేదికపై బలంగా వినిపించడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యమని సమాచారం. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, హింసకు బదులు చర్చ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరమైన పోరాటమే సరైన మార్గమని వారు చెబుతున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా కొత్త చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పని చేయనున్నది.
కొత్త పార్టీ... కొత్త ఆశలు
‘మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తర్‌లోనే ఉంటారా? లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా?’ అన్న ప్రశ్నకు ఆశన్న కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పని చేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు. పునరావాసంగా వచ్చే రూ. 40 లక్షల కోసం తాము జనజీవన స్రవంతిలోకి రాలేదని, ఆ డబ్బును తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తానని వివరించారు. కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని, ఏ రకమైన వ్యాపారం చేయబోనని ఆశన్న తెలిపారు. అక్టోబర్‌లో 60 మంది మావోయిస్టు కేడర్లతో సోనూ, 210మందితో ఆశన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత.. లొంగుబాట్ల పర్వం వరుసగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా 41మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు కేడర్ల సంఖ్య 600కు పైనే ఉంటుంది. వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

