Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు టాప్ లీడర్ మృతి..

జార్ఖండ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ టాప్ లీడర్ ప్రయాగ్ మాంఝీ మృతి చెందాడు. అతడి తలపై కోటి రూపాయల రివార్డ్ ఉంది. బొకారో జిల్లా లాల్ పానియా ప్రాంతంలోని లుకు పర్వత ప్రాంత పాదాల దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. మాంఝీపై జాతీయ దర్యాఫ్తు సంస్థ ఇప్పటికే కోటి రూపాయల రివార్డ్ ప్రకటించింది.
అతడికి వివేక్, పుచన, నాగ మాంఝీ, కరన్, లెతర అని మార్లు పేర్లు ఉన్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంఝీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించే వాడు. ధనాబాద్ జిల్లా తుండి పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్ బుద మాంకీలో పుట్టాడు. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఒడిశాలో దాదాపు 100 దాడుల్లో అతడి హస్తం ఉంది. ఒక్క గిరిది జిల్లాలోనే అతడిపై 50 కేసులు ఉన్నాయి. జార్ఖండ్ లో అత్యధిక రివార్డ్ ఉన్న రెండో మావోయిస్టు. మాంఝీ కాకుండా మరో నలుగురిపై కోటి రూపాయల రివార్డులు ఉన్నాయి.
ప్రయాగ్ మాంఝీ పరస్ నాథ్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లుగా సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్నాళ్ల క్రితం అతడిని గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వీరికి లుకు హిల్స్ దగ్గర మావోయిస్టులు ఎదురుపడ్డారు. దాంతో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అనంతరం భద్రతా బలగాలు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించగా మొత్తం 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ 8మందిలో ప్రయాగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది జార్ఖండ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2025 చివరికి రాష్ట్రాన్ని మావో రహిత రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా 244 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. పలు దళాల కమాండర్లతో కలిపి 24 మంది లొంగిపోయారు. ప్రయాగ్ భార్య జయని గతేడాది అరెస్ట్ చేశారు. ఆమె క్యాన్సర్ తో బాధపడుతోంది. చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో ఆమెను అరెస్ట్ చేశారు. చికిత్స పొందుతూ జయ మరణించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com