Maoists Encounter: బీజాపూర్లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఉత్తర–పశ్చిమ ప్రాంతంలో భద్రతా బలగాలకు మరో భారీ విజయం లభించింది. భోపాలపట్నం–ఫర్సేగఢ్ సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ఇంచార్జ్ డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా మొత్తం ఆరు మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో డీఆర్‌జీ బీజాపూర్, డీఆర్‌జీ దంతేవాడ, ఎస్‌టీఎఫ్, కోబ్రా బలగాలు (202, 206, 210 బెటాలియన్లు), సీఆర్‌పీఎఫ్ 214 బెటాలియన్‌కు చెందిన సంయుక్త బృందాలు జనవరి 17న ప్రత్యేక సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జనవరి 17 ఉదయం నుంచి 18 సాయంత్రం వరకు మధ్య మధ్యలో తీవ్ర కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనాస్థలంలో నిర్వహించిన గాలింపుల్లో డీవీసీఎం దిలీప్ బెండ్జా (రూ.8 లక్షల రివార్డు)తో పాటు ఏసీఎం మాడ్వీ కోసా, ఏసీఎం పాలొ పొడియం, ఏసీఎం లక్కీ మడ్కం, పీఎం జుగ్లో బంజామ్, పీఎం రాధా మేట్టా మృతదేహాలను గుర్తించారు. మృత మావోయిస్టులపై మొత్తం రూ.27 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మృతుల వద్ద నుంచి రెండు ఏకే–47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు 0.303 రైఫిళ్లు, ఒక కార్బైన్ సహా మొత్తం ఆరు ఆధునిక ఆయుధాలు, బీజీఎల్ లాంచర్, బీజీఎల్ సెల్స్, గోలీలు, పేలుడు పదార్థాలు, వైర్‌లెస్ సెట్లు, స్కానర్, మావోయిస్టు సాహిత్యం, వర్దీలు, వైద్య సామగ్రి తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీవీసీఎం దిలీప్ బెండ్జాపై బీజాపూర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 135కు పైగా కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతంలో సాల్హేపల్లి హత్య, రాణిబోడలి క్యాంప్‌పై దాడి, కాండలపర్తి, చిన్నేకాకలేరు, అన్నాపూర్ టేకామేట ఎన్‌కౌంటర్లు, పీలూర్‌లో విద్యాదూత హత్య వంటి పలు కీలక ఘటనల్లో అతడు పాల్గొన్నట్లు వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
