Suleman Musa: పహల్గామ్ సూత్రధారి సులేమాన్ మూసా హతం.. అసలు ఇతడెవరు?

భారత సైన్యం సోమవారం భారీ విజయాన్ని సాధించింది. భారతీయులను గాయపరిచిన ముష్కరులను ఆర్మీ మట్టుబెట్టింది. పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ముగ్గురు ఉగ్రవాదుల అంతు చూసింది. ఇక పహల్గామ్ సూత్రధారి హషీం మూసా అలియాస్ సులేమాన్ మూసా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పహల్గామ్ ఉగ్రదాడికి ఇతడే కీలక సూత్రధారి. భారతీయులు ఆశ్చర్యపడేలా కీలక ఉగ్రవాది మూసాను సైన్యం అంతం చేసింది.
పక్కా ప్రణాళికతో భారత సైన్యం సోమవారం ఆపరేషన్ చేపట్టింది. శ్రీనగర్‌లో దట్టమైన అడవిలో తలదాచుకున్న ఉగ్రవాదుల జాడను సైన్యం పసిగట్టింది. సంచార జాతుల వారు ఇచ్చిన పక్కా సమాచారంతో ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించింది. భారత సైన్యంతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందాలు ఆపరేషన్ మహాదేవ్‌లో పాల్గొన్నాయి. శ్రీనగర్‌లోని హర్వాన్ ప్రాంతంలోని డాచిగామ్ అటవీ ఎగువ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికను ముందుగా కనిపెట్టి.. చాకచక్యంగా ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు మట్టుబెట్టాయి. దాదాపు 14 రోజులుగా ఉగ్రవాదుల కదిలికలపై నిఘా పెట్టాయి.. అయితే ఈరోజు సంచార జాతులు నిర్ధారించడంతో రంగంలోకి దిగి సైన్యం హతమార్చింది.
హషీం మూసా ఎవరు?
హషీం ముసా అలియాస్ సులేమాన్ మూసా పాకిస్థాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)లో మాజీ పారా-కమాండో. సైన్యంలో ఉన్నప్పుడు కీలకమైన పదవి నుంచి తొలగింపబడ్డాడు. అనంతరం నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)లో చేరినట్లుగా నిఘా వర్గాల సమాచారం. మూసా అసాధారణ యుద్ధాలు చేయడంలో, రహస్య కార్యకలాపాలు నిర్వహించడంలో నిపుణుడని చెబుతుంటారు. అధునాతన ఆయుధాలు ప్రయోగించడంలో కూడా దిట్ట. అంతేకాకుండా అనేక మందికి తర్ఫీదు ఇవ్వడంలో కూడా మంచి నైపుణ్యం ఉంది. కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి పాకిస్థాన్ ఆర్మీనే అతడ్ని నియమించినట్లుగా సమాచారం. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. స్థానికులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారించగా సులేమాన్ కుట్రలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా అతడి జాడ గురించి తెలిసింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఉగ్రవాదులంతా భారత్‌లోనే తలదాచుకుంటున్నారని దర్యాప్తు బృందాలకు పక్కా సమాచారం అందింది. స్థానికులు సాయంతో వారికి ఆహారం, నీళ్లు, వగేరా వసతులు అందుతున్నట్లుగా కనిపెట్టాయి. అయితే 14 రోజుల నుంచి అనుమానాస్పద సంభాషణను సైన్యం పసిగట్టింది. దీనికి సంచార జాతుల సాయం కూడా తోడైంది. వారు ఇచ్చిన పక్కా సమాచారంతో సోమవారం ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి సైన్యం విజయం సాధించింది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com