Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా..

లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ కోరింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ ఇప్పటికే ఆరుసార్లు సమన్లు పంపింది. దీంతో ఈరోజు ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున సమన్లు చట్ట విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. కోర్టు విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ వేచిచూడాల్సిందే అని పేర్కొంది.
ఈడీ చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని సూచించింది. కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని కోరింది. ముఖ్యమంత్రికి పలుమార్లు సమన్లు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది. ‘ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. తదుపరి విచారణ మార్చి 16న జరగనుంది. రోజువారీ సమన్లు పంపే బదులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఓపిక పట్టాలి. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలి’ అని ఆప్ పేర్కొంది.
కాగా, ఈడీ ఇప్పటివరకు పలుసార్లు సమన్లు జారీ చేయగా, కేజ్రీవాల్ వాటిని చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై ఈడీ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఢిల్లీ బడ్జెట్ సమావేశాల వల్ల కోర్టు విచారణకు కేజ్రీవాల్ హాజరు రాలేకపోయారు. దీంతో కోర్టు విచారణ మార్చి 16కు వాయిదా పడింది.
కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరుసార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఆరుసార్లూ ఆయన ఈడీ విచారణకు నిరాకరించారు. గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపింది. అయితే అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 22వ తేదీన ఏడోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ పేర్కొంది. అయితే, ఈ నోటీసులను కూడా కేజ్రీ బేఖాతరు చేశారు. ఈరోజు కూడా విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడంలేదని ఆప్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com