Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను.. బీఎస్పీ నుంచి బహిష్కరించిన మాయావతి

Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను.. బీఎస్పీ నుంచి బహిష్కరించిన మాయావతి
X
పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారసుడిగా ప్రచారం జరిగిన మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించిన మరునాడే ఈ మేరకు వేటు వేశారు. పార్టీ షోకాజ్ నోటీసుకు ఆకాష్‌ ఆనంద్‌ ప్రతిస్పందన ‘స్వార్థపూరితమైనది, అహంకారపూరితమైనది’ అని ఆమె విమర్శించారు.

కాగా, బీఎస్పీ నుంచి ఇప్పటికే బహిష్కరించిన మామ అశోక్ సిద్ధార్థ్ ప్రభావంలో ఆకాష్‌ ఆనంద్‌ ఉన్నట్లుగా ఆయన సమాధానం స్పష్టం చేసిందని మాయావతి ఆరోపించారు. ‘ఆయన (ఆకాష్ ఆనంద్) దీనికి పశ్చాత్తాపపడి తన పరిణతిని ప్రదర్శించి ఉండాలి. కానీ దీనికి విరుద్ధంగా ఆకాష్ ఇచ్చిన సుదీర్ఘ ప్రతిస్పందన ఆయన పశ్చాత్తాపం, రాజకీయ పరిణతికి చెందినది కాదు. చాలా స్వార్థపరుడు, అహంకారి. తన మామకు ప్రభావితం కానివాడు కాదు’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

మరోవైపు అత్యంత గౌరవనీయులైన బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆత్మగౌరవం, ఆత్మగౌరవ ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా, కాన్షీరామ్ క్రమశిక్షణా సంప్రదాయాన్ని అనుసరించి ఆకాష్ ఆనంద్‌ను ఆయన మామ మాదిరిగానే పార్టీ నుంచి నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశంలో కూడా రెండు వర్గాలుగా బీఎస్పీని విభజించడం ద్వారా పార్టీని బలహీనపరిచే దారుణమైన కుట్రకు ఆకాష్‌ ఆనంద్‌ పాల్పడినట్లు ఇటీవల మాయావతి ఆరోపించారు. ఇది పూర్తిగా సహించరానిదని అన్నారు. ఆదివారం జరిగిన బీఎస్సీ సమావేశంలో పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు.

Tags

Next Story