National Medical Commission: వైద్యులందరికీ ప్రత్యేక ఐడీ
దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులైన ఎంబీబీఎస్ డాక్టర్లందరి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తన పోర్టర్‌లో ప్రారంభించింది. వైద్యులకు ప్రత్యేక గుర్తింపు కార్డు కేటాయింపులో భాగంగా ఇటీవల ఎన్‌ఎంసీ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైద్యులందరూ నేషనల్ మెడికల్ రిజిస్టర్ (ఎన్‌ఎంఆర్)లో నమోదవుతారు. ఆధార్ కార్డుల ద్వారా వారి ప్రామాణికతను ధ్రువీకరిస్తారు. ఇండియన్ మెడికల్ రిజిస్టర్ (ఐఎంఆర్)లో రిజిస్టర్ అయిన ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ మరోసారి ఎన్‌ఎంఆర్, ఎన్‌ఎంసీలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఇటీవల ప్రారంభించిన పోర్టల్‌లో వైద్యుల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులందరూ ఇందులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా నమోదు చేసుకున్న వారికి విశిష్ట గుర్తింపు ఐడీని కేటాయిస్తారు. నేషనల్ మెడికల్ రిజిస్టర్(ఎన్‌ఎంఆర్) అనేది ఒక డైనమిక్ డాటాబేస్. ఇందులో వైద్యుల ప్రామాణికతను ఆధార్ ద్వారా ధ్రువీకరిస్తారు. రిజిస్ట్రేషన్‌కు ఎన్‌ఎంఆర్ సిద్ధంగా ఉన్నదని, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్‌ఎంపీలు) అందరూ తక్షణమే ఇందులో నమోదు చేసుకోవాలని ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్ బి శ్రీనివాస్ తెలిపారు.
ఇండియన్ మెడికల్ రిజిస్టర్ (ఐఎంఆర్) వద్ద నమోదుచేసుకున్న ఎంబీబీఎస్ వైద్యులు కూడా ఎన్‌ఎంఆర్‌లో మరోమారు రిజిస్టర్ చేసుకోవాలని నోటీస్ జారీ అయ్యింది. దీని ప్రకారం, పోర్టల్‌లో వైద్యులకు సంబంధించిన సమాచారం కొంత ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ‘హెల్త్ కేర్ ప్రొవైడర్ రిజిస్ట్రీ’లోనూ వైద్యులు చేరేందుకు ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ‘దేశంలో ఇప్పటివరకు ఎంతమంది అర్హులైన వైద్యులున్నారు? విదేశాలకు వెళ్లినవారెంత మంది? డాక్టర్‌గా లైసెన్స్ కోల్పోయిన వాళ్లెంత మంది? సమగ్రమైన డాటా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంఆర్ పోర్టల్‌ను తీసుకొచ్చారు. దాదాపు 13 లక్షల మంది వైద్యుల డాటా పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది’ అని ఎన్‌ఎంసీ అధికారి ఒకరు చెప్పారు.
ఆధార్ ఐడీ, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్ డిజిటల్ కాపీ, ఎంసీఐ లేదా రాష్ట్ర స్థాయి స్టేట్ మెడికల్ కౌన్సిల్ జారీచేసిన సర్టిఫికెట్‌లను రిజిస్ట్రేషన్ సమయంలో వైద్యులు సమర్పించాల్సి ఉంటుంది. వైద్యుడు సమర్పించిన పత్రాలను సంబంధిత స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు పంపి ధృవీకరిస్తారు. దరఖాస్తులోని వివరాలు సరైనవా?కావా? అన్నది సంబంధిత వైద్య కాలేజీకి పంపి నిర్ధారిస్తారు. వివరాలన్నీ సరైనవేనని తేలాక.. దరఖాస్తు తిరిగి ఎన్‌ఎంసీకి చేరుతుంది. అటు తర్వాత ఎన్‌ఎంసీ నుంచి సదరు వైద్యుడికి విశిష్ట గుర్తింపు ‘ఎన్‌ఎంఆర్ ఐడీ’ జారీ అవుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com