Uttar Pradesh : పురుష టైలర్లు మహిళల కొలతలు తీయరాదు

స్త్రీల దుస్తులను పురుషులు కుట్టకూడదని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రతిపాదించింది. అంతేగాక, మహిళలకు పురుషులు హెయిర్ కటింగ్ చేయకూడదని కూడా సూచించింది. మహిళలను “బ్యాడ్ టచ్” నుంచి రక్షించాలని, పురుషుల అభ్యంతరకర వైఖరిని నిరోధించాలని ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లు మహిళా కమిషన్ తెలిపింది. అక్టోబరు 28న మహిళా కమిషన్ ఓ సమావేశం నిర్వహించి, చర్చించి ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. టైలర్ షాపుల్లో మహిళల దుస్తుల కొలతను పురుషులు తీయకూడదని, మహిళలు మాత్రమే వారి కొలతలు తీసుకోవాలని చెప్పింది.
ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందేనని తెలిపింది. సెలూన్‌లలోనూ స్త్రీలకు మహిళా సిబ్బందే సర్వీసులు అందించాలి. టైలర్, సెలూన్లలో వృత్తుల్లో ఉన్న పురుషులు మహిళలను అసభ్యంగా తాకడం, వారిని వేధించేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉండడంతో ఇటువంటి ప్రతిపాదనలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషనర్ హిమానీ అగర్వాల్ తెలిపారు. ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనథ్ ప్రభుత్వానికి పంపనున్నారు. వాటిని కఠినంగా అమలు చేసేలా చట్టాన్ని తీసుకురావాలని కోరనున్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com