వీధి కుక్కలపై సుప్రీం తీర్పును విమర్శించిన మేనక.. పర్యావరణానికి హానికరమంటూ..

వీధి కుక్కలపై సుప్రీం తీర్పును విమర్శించిన మేనక.. పర్యావరణానికి హానికరమంటూ..
X
ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుండి వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని మేనకా గాంధీ విమర్శించారు. ఇది అసాధ్యమని, పర్యావరణ సమతుల్యతకు హానికరమని అభివర్ణించారు.

ఢిల్లీ-ఎన్‌సిఆర్ వీధుల నుండి అన్ని వీధి కుక్కలను ఆరు నుంచి ఎనిమిది వారాలలోపు తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని మాజీ కేంద్ర మంత్రి మరియు జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఇది "ఆచరణీయం కాదు", "ఆర్థికంగా లాభదాయకం కాదు" మరియు ఈ ప్రాంతం యొక్క పర్యావరణ సమతుల్యతకు హానికరం అని అన్నారు.

ఈ ఉత్తర్వు పౌర సంస్థలకు భారీ లాజిస్టికల్ సవాలును కలిగిస్తుందని, కుక్కలను రక్షించే ప్రయత్నాలను క్లిష్టతరం చేస్తుందని గాంధీ అన్నారు. " ఢిల్లీలో మూడు లక్షల కుక్కలు ఉన్నాయి. వాటన్నింటినీ రోడ్లపై నుండి తొలగించడానికి వాటికి షెల్టర్ కల్పించడానికి దాదాపు రూ. 15,000 కోట్లు ఖర్చవుతుంది. దీని కోసం ఢిల్లీలో రూ. 15,000 కోట్లు ఉన్నాయా?" అని ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు .

బంధించబడిన కుక్కలకు ఆహారం పెట్టడానికి వారానికి మరో రూ. 5 కోట్లు అవసరమవుతుందని, ఇది ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుందని ఆమె అన్నారు.

“ఢిల్లీలో ప్రభుత్వం నడిపే ఒక్క ఆశ్రయం కూడా లేదు. మీరు 3 లక్షల కుక్కలను ఎక్కడ ఉంచుతారు అని ఆమె ప్రశ్నించారు. కుక్కలను తొలగించడం వల్ల కొత్త పర్యావరణ సమస్యలు తలెత్తవచ్చని గాంధీ హెచ్చరించారు.

"ఢిల్లీలో ఆహారం ఉన్నందున 48 గంటల్లోపు, ఘజియాబాద్, ఫరీదాబాద్ నుండి మూడు లక్షల కుక్కలు వస్తాయి. మీరు కుక్కలను తొలగిస్తే కోతులు నేలపైకి వస్తాయి... ఇది నా స్వంత ఇంట్లో జరగడం నేను చూశాను" అని ఆమె చెప్పింది.

1880లలో పారిస్‌ లో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. నగర పరిపాలన కుక్కలు మరియు పిల్లులను తొలగించినప్పుడు, నగరం ఎలుకలతో నిండిపోయిందని ఆమె తెలిపారు. కుక్కలు "ఎలుకలను నియంత్రించే జతువులు" అని ఆమె అన్నారు.

Tags

Next Story