IIT Madras: మద్రాస్ ఐఐటీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. రోజురోజుకి మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా మద్రాస్ ఐఐటీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ రీసెర్చ్ స్కాలర్ అయిన మహిళ(30)పై వలస కార్మికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తారామణి-వేలాచ్చేరి మెయిన్ రోడ్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక మగ స్నేహితుడితో ఉండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ అనే 29 ఏళ్ల వలస కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మంగళవారం సాయంత్రం మద్రాస్ ఐఐటీ క్యాంపస్ సమీపంలోని టీషాప్ దగ్గర మహిళా రీసెర్చ్ స్కాలర్.. మగ స్నేహితుడితో ఉంది. వలస కార్మికుడు ఆమెను లైంగికంగా వేధించాడు. సాయం కోసం బాధితురాలి కేకలు వేసింది. సమీపంలో ఉన్న స్నేహితులు.. నిందితుడిని పట్టుకుని కొత్తూరుపురం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి కార్మికుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. క్యాంపస్‌లో స్కాలర్‌పై లైంగిక వేధింపులు జరగడం వాస్తవమేనని ఐఐటీ మద్రాస్ దృవీకరించింది. స్నేహితుల సాయంతో ఆమె బయటపడినట్లుగా పేర్కొంది. నిందితుడు క్యాంపస్ వెలుపల బేకరీలో పనిచేస్తున్నాడని.. మద్రాస్ ఐఐటీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని.. విద్యార్థులకు బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అందుకు ఇనిస్టిట్యూ్ట్ సాయం చేస్తుందని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com