Milind Deora: కాంగ్రెస్‌కు మిలింద్ దేవరా గుడ్ బై

Milind Deora: కాంగ్రెస్‌కు మిలింద్ దేవరా గుడ్ బై
శివసేనలో చేరిక!

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కీలక నేత మిలింద్‌ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రారంభం రోజు కాంగ్రెస్‌ పార్టీకి మిలింద్‌ దేవరా షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, నేడు మహా సీఎం ఏక్‌నాథ్‌ షిండే సమక్షంలో శివసేనలో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ప్రకటించారు. 55 ఏండ్లగా కాంగ్రెస్‌ పార్టీతో తమ కుటుంబానికున్న సంబంధం నేటితో తెగిపోయింది. నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనా చేశాను. నా రాజకీయ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని నేడు ప్రారంభిస్తున్నాను. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు.

కాగా, 2014 వరకు ఆయన ప్రాతిథ్యం వహించిన ముంబై దక్షిణ పార్లమెంట్‌ సీటుపై నెలకొన్న సందిగ్ధతే పార్టీ వీడటానికి కారణంగా తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో ముంబై దక్షిణ ఎంపీ స్థానం నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీంతో పొత్తులో భాగంగా తనకు పోటీచేసే అవకాశం లభించదని భావించిన దేవరా.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ దివంగత నేత మురలీ దేవరా కుమారుడు మిలింద్‌ దేవరా. ఆయన లోక్‌సభకు తొలిసారిగా 2004లో ముంబై సౌత్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2011లో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా బాధ్యలు చేపట్టారు. 2012లో అదనంగా షిప్పింగ్‌ శాఖను అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అప్పగించారు. ముంబయి సౌత్‌ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్‌ కాంగ్రెస్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్‌ సావంత్‌ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్‌ ముంబయి లోక్‌ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story