రెండోకాన్పులో ఆడపిల్లకు రూ.6వేలు

కొడుకంటే ప్లస్ అని కూతురు అంటే మైనస్ అని ఆలోచించే కాలం నుంచి కాస్త దూరం ప్రయాణం చేసాం. కానీ ఇప్పటికీ ఆడపిల్లని భారంగా భావించే తల్లిదండ్రులు ఆర్థికంగా దిగువన ఉన్న కుటుంబాలలో లేకపోలేదు. ఒకప్పుడు ఆడపిల్ల గర్భంలో ఉంది అని తెలియగానే ప్రాణాలు తీసేసేవారు. ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో పుట్టి పుట్టగానే, లోకం చూడకుండానే వదిలించేసుకుంటున్నారు. ఇకపై ఏ ఆడపిల్ల అనాధ కాకూడదు అనే ఉద్దేశంతో ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో పథకాన్ని రూపకల్పన చేసింది.
మిషన్ శక్తి పేరుతో అమలు చేయనున్న ఈ పథకంలో భాగంగా రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే తల్లుల ఖాతాలో రూ.6000ను కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఆడపిల్లల సంఖ్య పెంచడం,తల్లిదండ్రులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండవ కాన్పులో ఒకవేళ కవలలు పుడితే కవలలలో ఒక్కరు ఆడపిల్ల అయినా ఈ పథకం వర్తిస్తుంది. కానీ కవలలు ఇద్దరు ఆడపిల్లలే అయితే, వారిలో ఒకరికి మాత్రమే రూ. 6000 ప్రభుత్వం జమ చేస్తుంది. 2022 ఏప్రిల్ నుంచి దీన్ని వర్తింప చేస్తారు.
ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటినుంచి మూడు దశల్లో రూ. 5000 ప్రభుత్వం చెల్లిస్తుంది. మహిళ గర్భం దాల్చినట్టు ఆన్లైన్లో నమోదు కాగానే 1000, ఆరు నెలల తర్వాత 2000, ప్రసవం జరిగిన 14 వారాల్లో రూ. 2000 చొప్పున అందజేస్తుంది. అయితే ఈ PMVY పథకం రెండవ కాన్పుకు వర్తించేది కాదు. ఇప్పుడు దాన్ని సవరిస్తూ రెండో కాన్పులో అమ్మాయి పుడితే తల్లికి ఆరు వేలు ఇచ్చేలా మార్పులు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com