MODI: బ్రాండ్ మోదీ: చెరగని ముద్ర

దేశ రాజకీయ యవనికపై ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి బలం రోజురోజుకూ పెరుగుతోందని 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే స్పష్టం చేసింది. ఇండియా టుడే, సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ తాజా సర్వేలో ప్రధాని మోదీ పట్ల దేశ ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని వెల్లడైంది. గత ఎనిమిది వారాల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 1.25 లక్షల మంది అభిప్రాయాలను సేకరించి గురువారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఒకవేళ దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే అధికార కూటమికి ప్రజలు గతంలో కంటే ఎక్కువ స్థాయిలో బ్రహ్మరథం పడతారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని రెట్టింపు చేశాయని ఈ సర్వే విశ్లేషించింది. ఈ సర్వే అంచనాల ప్రకారం లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయే కూటమి ఏకంగా 352 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో ఈ కూటమి సొంతంగా మెజారిటీ మార్కును అందుకోవడంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, పూర్తి అనుకూలంగా మారాయి. గత ఎన్నికల్లో 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, ఇప్పుడు తన బలాన్ని పుంజుకుని ఒంటరిగానే 287 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని సర్వే నివేదిక తేల్చింది. అంటే మిత్రపక్షాల మద్దతు లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ట పెరగడం వంటి అంశాలు బీజేపీకి కలిసివస్తున్నాయి.
మరోవైపు ప్రతిపక్ష 'ఇండియా' కూటమి పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. దేశవ్యాప్త పవనాల ప్రభావంతో ప్రతిపక్ష కూటమి కేవలం 182 సీట్ల వద్దే ఆగిపోతుందని వెల్లడైంది. ప్రధాని మోదీ చరిష్మా, సుస్థిర పాలన పట్ల ప్రజలు చూపిస్తున్న మొగ్గు ప్రతిపక్షాల వ్యూహాలను దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లలో మోదీపై ఉన్న నమ్మకం ఎన్డీయేకు శ్రీరామరక్షగా మారుతోందని ఈ సర్వే విశ్లేషించింది. కేవలం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనే ప్రతిపక్షాలు కొంత మేరకు ప్రభావం చూపగలవని, జాతీయ స్థాయిలో మాత్రం మోదీకి ప్రత్యామ్నాయం లేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక సంస్కరణలు, ఉపాధి కల్పన వంటి అంశాల్లో ప్రజల ఆశలను అందుకోవడంలో ప్రభుత్వం సఫలమైందని ఈ సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
