PM Modi: నెహ్రూ వల్లే ఆ సమస్య వచ్చింది.. కాంగ్రెస్‌పై మండిపడ్డ మోడీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో నిర్వహించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో మోడీ పాల్గొని మాట్లాడారు. నెహ్రూ విధానాల వల్లే కాశ్మీర్ సమస్య వచ్చిందని.. ఆ సమయంలో కాంగ్రెస్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ‘‘కాశ్మీర్‌ను ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండాతో విభజించారు. దశాబ్దాలుగా కాశ్మీర్‌పై కాంగ్రెస్ చేసిన తప్పుకు దేశం అగ్నికి ఆహుతైంది. కాంగ్రెస్ బలహీన విధానాల కారణంగా కాశ్మీర్‌లో ఒక భాగం పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో పడింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచింది. దీంతో కాశ్మీర్, దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉగ్రవాదం ముందు తలవంచింది. కాంగ్రెస్.. సర్దార్ దార్శనికతను మర్చిపోయింది.. కానీ బీజేపీ అలా చేయలేదు.’’ అని మోడీ పేర్కొన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంతర్గత భద్రతను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిప్రాయాలను నెహ్రూ గౌరవించకపోవడంతోనే ఇదంతా జరిగిందన్నారు. దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. వల్లభాయ్ పటేల్ ఆశయాలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ఆర్టికల్ 370ను తొలగించి కాశ్మీర్‌ను భారత్ అభివృద్ధిలో జోడించినట్లు చెప్పుకొచ్చారు. ఎవడైనా భారత్‌పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్ సహా ఉగ్రవాదులందరికీ భారత్ సత్తా ఏంటో తెలిసి వచ్చిందన్నారు. ఇక అర్బన్ నక్సలైట్లు.. వారికి మద్దతు ఇచ్చే వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. భారత్ అంతర్గత భద్రతకు నక్సలైట్లు ముప్పుగా మారారని.. దేశానికి ముప్పు ఏర్పడితే ప్రతి ఒక్కరికి భద్రతా ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా తొలుత ఏక్తా పరేడ్ ప్రారంభోత్సవం జరిగింది. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో గార్డ్ ఆఫ్ ఆనర్, ఫ్లాగ్ మార్చ్ జరిగింది. పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), బ్యాండ్ బృందాలు, గుర్రాలు, ఒంటెలు, కుక్కలతో కూడిన మౌంటెడ్ జరిగాయి. ప్రత్యేక ప్రదర్శనల్లో మహిళల ఆయుధ కసరత్తు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, డేర్‌డెవిల్ మోటార్‌సైకిల్ విన్యాసాలు, నిరాయుధ పోరాట ప్రదర్శనలు, ఎన్‌సీసీ ప్రదర్శనలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, సాయుధ దళాల నుంచి శకటాలు, పాఠశాల బ్యాండ్ ప్రదర్శనలు, భారత వైమానిక దళం వైమానిక ప్రదర్శన జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

