Lalu Prasad Yadav: ఆగస్టులో మోదీ సర్కార్‌ కూలొచ్చు!

Lalu Prasad Yadav: ఆగస్టులో మోదీ సర్కార్‌ కూలొచ్చు!
X
మోడీ ప్రభుత్వంపై లాలూ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

మోడీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోడీ సర్కార్ బలహీనంగా ఉందని.. ఆగస్టులో కూలిపోవచ్చని జోస్యం చెప్పారు. ఆర్జేడీ పార్టీ స్థాపించి 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాట్నాలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాలూ ప్రసాద్, తనయుడు తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు.

ఆర్జేడీ వేడుకల్లో పాల్గొన్న లాలూ ప్రసాద్.. మోడీ సర్కార్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్‌కు ఆగస్టు సంక్షోభం రావొచ్చని పేర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ మెరుగైన ఫలితాలు సాధించిందని.. ఓట్ల శాతాన్ని కూడా మెరుగుపరుచుకుందని తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అస్వస్థత కారణంగా లాలూ సభలో ఎంతో సేపు మాట్లాడలేకపోయారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ 293, ఇండియా కూటమి 233 సీట్లు సాధించాయి. బీజేపీకి సొంతంగా 240 సీట్లే వచ్చాయి. మిత్రపక్షాల సపోర్టుతో మోడీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు

నీట్‌పై మంత్రుల ఆరోపణలకు తేజస్వీ కౌంటర్

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనపై చేస్తోన్న ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. శుక్రవారం ఆర్జేడీ 28వ వార్షికోత్సవం సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడారు.. నితీష్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాల్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో ఒక ఇంజిన్‌ అవినీతిని, మరో ఇంజిన్‌ నేరాలను ప్రమోట్‌ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పేపర్‌ లీకైనా, వంతెనలు కూలినా, హత్యలు జరిగినా.. రాష్ట్రంలో ప్రతి సమస్య తేజస్వీ వల్లేనంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం దగ్గర ఆధారం ఉంటే ఆరోపణలు మాని అరెస్టు చేసుకోవచ్చన్నారు. నీట్‌- యూజీ ప్రవేశపరీక్షలో జరిగిన అవకతవకలు, పేపర్‌ లీక్‌ వెనక తేజస్వీ యాదవ్ సహాయకుడి ప్రమేయం ఉందంటూ బీహార్‌ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ ఇటీవల ఆరోపించడంపై ఆర్జేడీ కౌంటర్‌ ఇచ్చింది. బీహార్‌లోని సీనియర్‌ మంత్రులతో ఇతర కీలక అనుమానితులు ఉన్న ఫొటోలను ఆర్జేడీ విడుదల చేసింది.

Tags

Next Story