Modi Kuwait Tour: కువైట్‌లో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన

Modi Kuwait Tour:  కువైట్‌లో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన
X
ఏం చేశారంటే

కువైట్‌లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటిస్తున్నారు. రక్షణ, వాణిజ్యంతోపాటు కీలక రంగాల్లో భారత్‌-కువైట్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయనున్నారు. అలాగే పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. 1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. అంతకుముందు ప్రవాస భారతీయులు ఇండియాకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. కువైట్‌లో జరిగిన 'హలా' కమ్యూనిటీ కార్యక్రమంలో ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. వచ్చే ఏడాది భువనేశ్వర్‌లో జరగనున్న 'ప్రవాసీ భారతీయ దివస్'లో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమన్న మోదీ.. 'విక్షిత్ భారత్' లక్ష్యాలను చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

కువైట్‌ భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందని మోదీ అన్నారు. ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించి ప్రశంసిస్తూనే ఉంటారని ప్రధాని వెల్లడించారు. విదేశీ కరెన్సీ స్వీకరించడంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని ప్రధాని తెలిపారు. మీరంతా కష్టపడి పని చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. భారత్‌, కువైట్‌ దేశాలు అరేబియా సముద్రానికి ఇరువైపులా ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాలను కేవలం దౌత్యసంబంధాలే కలపడం లేదని మోదీ తెలిపారు. హృదయ సంబంధాలు కూడా దగ్గర చేస్తున్నాయి. ఇప్పుడే కాదు.. గతంలోనూ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుండేవన్నారు. కువైట్‌కు అవసరమైన మానవ వనరులు, నైపుణ్యత, సాంకేతికతను అందించడంలో భారత్‌ ముందంజలో ఉందని ప్రధాని వెల్లడించారు.

రాబోయే కాలంలో ఈ రెండు దేశాలు కేవలం వాణిజ్యపరంగానే కాకుండా పరస్పర శ్రేయస్సు కోరుకునే భాగస్వాములు కూడా అవుతాయి. భారతదేశంలోని స్టార్టప్‌లు, సాంకేతిక కువైట్‌ అవసరాలకు అత్యాధునిక పరిష్కారాలను చూపించగలవని మోదీ అన్నారు. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో భారత్‌కు లిక్విడ్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసిన కువైట్‌ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story