MODI: చిరస్మరణీయ సంవత్సరం: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం, డిసెంబర్ 28 నిర్వహించిన ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. 129వ మన్ కీ బాత్‌లో 2025 సంవత్సరంలో భారతదేశం సాధించిన విజయ క్షణాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌ను మారుతున్న భారతావనిగా అభివర్ణించి, సైనిక విజయాన్ని దేశవ్యాప్త దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రధాని ప్రశంసించారు. ఈ ఏడాది భారత్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చూపిన ధైర్యం, స్వదేశీ ఆయుధాలు, టెక్నాలజీ ఉపయోగం ద్వారా సాధించిన విజయాలను మోదీ ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశం ఉగ్రవాదాన్ని రూపుమాపే నిర్ణయాన్ని చాటిందని, ఇది కేవలం సైనిక చర్య కాదు.. మారుతున్న భారత్ బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. అంతేకాకుండా, గిర్ అడవుల్లో ఆసియాటిక్ సింహాల సంఖ్య పెరుగుదల, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. వోకల్ ఫర్ లోకల్‌ను మరింత బలోపేతం చేయాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
క్రీడల పరంగా కూడా ఈ ఏడాది చిరస్మరణీయమనిమోదీ పేర్కొన్నారు. 12 ఏళ్ల తర్వాత టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుందని.. మహిళల క్రికెట్ జట్టు మొదటిసారి వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుందన్నారు. మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిందని గుర్తు చేసుకున్నారు. అంతరిక్ష రంగంలోనూ ఈ ఏడాది భారత్ తన ప్రతిభను చాటుకుందని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లాను ప్రశంసించారు. శుబాన్షు శుక్లా భారత కీర్తి పతాకను రెపరెపలాడించారన్నారు.
కోట్ల మంది పాల్గొన్న మహా కుంభమేళాను దిగ్విజయంగా నిర్వహించి భారత్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిందని మోదీ పేర్కొన్నారు. అయోధ్య రామాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి హిందువు గర్వపడేలా చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, ఇతర విషయాలను గుర్తు చేసుకున్నారు. 2025లో దేశ ప్రజలు ఏ విధంగా ఐక్యతతో సామరస్యంగా ఉన్నారో అదే విధంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో చూపిన ధైర్యం, స్వదేశీ ఆయుధ సంపత్తి, టెక్నాలజీ ఉపయోగం ద్వారా సాధించిన విజయాలను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తో దేశం ఉగ్రవాదాన్ని రూపుమాపే నిర్ణయాన్ని చాటిందన్నారు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు.. మారుతున్న భారత్ బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. . వోకల్ ఫర్ లోకల్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు.
మోదీ నరసాపురం లేస్ క్రాఫ్ట్ మాట..
మన్‌కీబాత్‌లో ప్రధాని మాట్లాడుతూ నరసాపురం లేస్ క్రాఫ్ట్ గురించి ప్రస్తావించారు. ప్రస్తుత మార్కెట్లో ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురంలో లేస్ క్రాఫ్ట్ చర్చనీయాంశంగా మారిందన్నారు. తరతరాల నుంచి మహిళలే ఈ అరుదైన కళను కాపాడుతూ వస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం నాబార్డ్‌తో కలిసి లేస్ క్రాఫ్ట్ కళాకారులకు కొత్త డిజైన్లు, నైపుణ్యాలు నేర్పిస్తోందని.. ప్రస్తుతం దీని మార్కెట్ వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రభుత్వ మద్దతుతో నరసాపురం ప్రజలు ఈ కళకు కొత్త హంగులను చేర్చి ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. లక్షలమంది మహిళలు ఉపాధి పొందుతున్న ఈ కళకు జీఐ గుర్తింపు కూడా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

