PM Modi: ఐక్యతా విగ్రహం దగ్గర వల్లభాయ్ పటేల్‌కు మోడీ నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించారు. గుజరాత్‌లోని నర్మద జిల్లాలోని ఏక్తా నగర్ సమీపంలో ఉన్న 182 మీటర్ల ఎత్తైన ఐక్యతా విగ్రహం దగ్గరకు ఉదయం 8 గంటలకు ప్రధాని మోడీ చేరుకున్నారు. ఉక్కు మనిషి విగ్రహం దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచారు. అనంతరం ప్రధాని మోడీ జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
కార్యక్రమంలో భాగంగా తొలుత ఏక్తా పరేడ్ ప్రారంభోత్సవం జరిగింది. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో గార్డ్ ఆఫ్ ఆనర్, ఫ్లాగ్ మార్చ్ జరిగింది. పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), బ్యాండ్ బృందాలు, గుర్రాలు, ఒంటెలు, కుక్కలతో కూడిన మౌంటెడ్ జరిగాయి. ప్రత్యేక ప్రదర్శనల్లో మహిళల ఆయుధ కసరత్తు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, డేర్‌డెవిల్ మోటార్‌సైకిల్ విన్యాసాలు, నిరాయుధ పోరాట ప్రదర్శనలు, ఎన్‌సీసీ ప్రదర్శనలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, సాయుధ దళాల నుంచి శకటాలు, పాఠశాల బ్యాండ్ ప్రదర్శనలు, భారత వైమానిక దళం వైమానిక ప్రదర్శన జరిగింది.
ఇదిలా ఉంటే ఐక్యతా విగ్రహం దగ్గరకు వెళ్లకముందు మోడీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు నివాళులు అర్పిస్తోంది. భారతదేశ సమైక్యతకు శక్తిగా నిలిచారు. జాతీయ సమగ్రత, సుపరిపాలన, ప్రజా సేవ పట్ల ఆయన అచంచలమైన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఐక్యమైన, బలమైన, స్వావలంబన భారతదేశం అనే ఆయన దార్శనికతను నిలబెట్టాలనే మా సమిష్టి సంకల్పాన్ని కూడా మేము అనుసరిస్తున్నాం.’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
ఇక గురువారం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ కలిశారు. సర్దార్ పటేల్ మనవడు గౌతమ్ పటేల్, ఆయన భార్య నందిత, కుమారుడు కేదార్, కోడలు రీనా, మనవరాలు కరీనాను కలిశారు. ‘‘కెవాడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబాన్ని కలిశాను. వారితో సంభాషించడం, దేశానికి సర్దార్ పటేల్ చేసిన అద్భుతమైన సహకారాన్ని గుర్తుచేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.’’ అని మోడీ ఎక్స్‌లో రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

