UP: శిశువును ఫ్రీడ్జ్ లో పెట్టి మరిచిపోయిన తల్లి!

నవ మాసాలు మోసి, ప్రాణాలు పణంగా పెట్టి తన బిడ్డను భూమి మీదకు తీసుకువస్తుంది తల్లి. అందుకే మాతృమూర్తిని భగవంతుడు సైతం చేతులెత్తి మొక్కాలని చెబుతాడు. కానీ ఇక్కడ ఒక తల్లి తన బిడ్డ నిద్ర పోకుండా ఏడుస్తుందని ఏకంగా ఫ్రిజ్‌లో పెట్టింది. నవజాత శిశువు ఏడుపు విని ఇంట్లో వాళ్లు పరుగున వచ్చారు కాబట్టి సరిపోయింది.. లేదంటే తలుచుకోడానికి కూడా ఆలోచనలు లేవు. ఎందుకు ఆ తల్లి అలా చేసింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా.. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత ఆ కుటుంబం ఏం చేసింది.. వైద్యులు ఏం అంటున్నారు.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఒక మహిళ తన 15 రోజుల నవజాత శిశువు ఏడుస్తుందని, నిద్రలోకి జారుకోడానికి ఏకంగా ఫ్రిజ్‌లో పెట్టింది. ఆ శిశువు ఏడుపు విని ఇంట్లో ఉన్న వాళ్ల అమ్మమ్మ వెంటనే అక్కడికి వచ్చి ఆ శిశువును ఫ్రిజ్‌లోంచి బయటకు తీసింది. అమ్మమ్మ అటుఇటుగా వస్తే బిడ్డ పరిస్థితి ఏంటనేది ఆలోచించడానికి కూడా మనసు రావడం రాలేదు. బిడ్డను కాపాడిన అమ్మమ్మ మాట్లాడుతూ.. ఆ శిశువు నిద్రపోకుండా ఏడుస్తోందని, వాళ్ల అమ్మ ఆ శిశువును ఫ్రిజ్‌లో ఉంచిందని చెప్పింది. ఇది విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆ తల్లికి దయ్యం లాంటిది ఏమైనా పట్టిందని భావించిన వాళ్లు ఆమెను భూతవైద్యం చేసే బాబా వద్దకు తీసుకెళ్లారు. కానీ దాని వల్ల ఆమెకు ఏ ప్రయోజనం లేకపోయింది.
తరువాత, ఒకరి సూచన మేరకు ఆ కుటుంబం ఆ మహిళను నగరంలోని మానసిక వైద్యుడు కార్తికేయ గుప్తా వద్దకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ ఆమెను పరీక్షించి చికిత్స ప్రారంభించాడు. ఈసందర్భంగా ఆ మానసిక వైద్యుడు మాట్లాడుతూ.. మహిళ పోస్ట్‌పార్టమ్ డిజార్డర్ అనే మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని చెప్పారు. ఈ పరిస్థితి కొంతమంది మహిళల్లో డెలివరీ తర్వాత కనిపిస్తుందని, దాదాపు 10-15 శాతం మంది మహిళలు డెలివరీ తర్వాత పోస్ట్‌పార్టమ్ బ్లూస్ లక్షణాలతో ఇబ్బంది పడతారని చెప్పారు. ఈ లక్షణాలు సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాలలో తగ్గిపోతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా మారి ప్రసవానంతర నిరాశ లేదా మానసిక స్థితి సరిగ్గా లేకుండా మారవచ్చని అన్నారు. ప్రసవానంతరం స్త్రీలలో మానసిక సమస్యలు 0.1-0.2 శాతం మందిలో కనిపిస్తాయన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న స్త్రీలకు భ్రమలు, భ్రాంతులు, అధిక ఆందోళన, నిద్రలేమి, కొన్నిసార్లు తమ పట్ల లేదా పిల్లల పట్ల హానికరమైన రీతిలో ప్రవర్తించే ధోరణి ఉంటుందన్నారు.
ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న స్త్రీలకు చికిత్స ద్వారా నయం చేయవచ్చు అన్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు తమకు లేదా తమ బిడ్డకు ఎవరైనా హాని చేస్తారని భావిస్తారని, అయితే వీరికి చికిత్స చేసి నయం చేయవచ్చని డాక్టర్ చెప్పారు. ఈ సమస్యను మందులు, మానసిక వైద్యుడు ఇచ్చే సలహాలు, కుటుంబ మద్దతు అవసరం అని అన్నారు. సకాలంలో చికిత్స ప్రారంభించడం ద్వారా, సమస్యతో బాధపడుతున్న మహిళ పూర్తిగా కోలుకోవచ్చని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని, తనకు మద్దతు అందించాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com