Central Home Department : అవినీతిలో టాప్ హోం శాఖ

Central Home Department : అవినీతిలో టాప్ హోం శాఖ
తర్వాతి స్థానాల్లో రైల్వే, బ్యాంకు ఉద్యోగులు

అవినీతి. ఇది వ్యవస్థను పట్టి పీడిస్తున్న అతి పెద్ద రోగం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఈ జలగ వదలనే లేదు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జరిగిన సంఘటనలకు సంబంధించి అందిన అవినీతి ఫిర్యాదులపై ఓ నివేదిక వెల్లడైంది. మొత్తం కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గతేడాది 1.15 లక్షల అవినీతి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.


అయితే అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది కేంద్ర హోంశాఖ. తర్వాతి స్థానాల్లో రైల్వే, బ్యాంకు ఉద్యోగులు నిలిచారు. ఈ మేరకు గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై అందిన ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఓ నివేదిక విడుదల చేసింది. గతేడాది కేంద్రంలో అన్ని విభాగాలకు సంబంధించి లక్షా 15వేల ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది. వాటిలో 85వేల 4వందల 37 ఫిర్యాదులను పరిష్కరించగా....29వేలు పెండింగులో ఉన్నట్లు తెలిపింది. గతేడాది హోంశాఖ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు అత్యధికంగా 46వేల 6వందల 43 ఫిర్యాదులు అందినట్లు CVC పేర్కొంది. రైల్వే ఉద్యోగులపై 10వేల 8 వందల 50, బ్యాంకులపై 8వేల నూటా 29 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. దిల్లీలో పనిచేసే ఉద్యోగులపై 7వేల 3వందల 70 ఫిర్యాదులు రాగా ఇందులో ఎక్కువగా ఢిల్లీ డెవలెప్‌మెంట్‌ అథారిటీలోనే ఉన్నాయి.ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌, ఢిల్లీ అర్బన్‌ ఆర్ట్‌ కమిషన్‌ వంటి విభాగాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

బొగ్గు శాఖలో 4వేల 3వందల 4, కార్మిక శాఖలో 4వేల 2వందల 36, పెట్రోలియం శాఖలో 2వేల 6వందల17 ఫిర్యాదులు అందాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌లో 2వేల నూటా 50, రక్షణ శాఖలో ఒక వెయ్యి 6వందల 19 ఫిర్యాదులు వచ్చాయని సీవీసీ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story