TMC: ముందు ప్రధాని మోడీ, కేంద్ర కేబినెట్, ఆ తర్వాతే లోక్‌సభ రద్దు చేయాలి.. టీఎంపీ నేత అభిషేక్ బెనర్జీ

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ (EC) ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయంటే.. మొదట ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన కేబినెట్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక, ఎన్నికల కమిషన్ తప్పుడు ఓటర్ల జాబితా ఆధారంగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది.. కాబట్టి దానికి చట్టబద్ధత లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని, హోంమంత్రి, రక్షణమంత్రి, ఆరోగ్యమంత్రి సహా 240కిపైగా బీజేపీ ఎంపీలు ఇదే ఓటర్ల జాబితా ఆధారంగా గెలిచినట్లు ఆరోపించారు. ఈ ఎంపీలు అందరు రాబోయే రోజుల్లో దేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా ఎన్నబోతున్నారని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు.
ఇక, ఎన్నికల కమిషన్ కొన్ని రాష్ట్రాల్లోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతూ.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సరైనదని చెప్పడం తప్పు అని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తెలిపారు. దేశంలో చట్టం ఒక్కటే, రాష్ట్రాల వారీగా వేరే నియమాలు ఉండవని అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిస్తే బీజేపీ ఓడిపోతుందని తెలిసి, అక్కడే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రారంభించారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ఓటర్ల హక్కును దోచుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అలాగే, ఢిల్లీలో ప్రతిపక్ష ఎంపీలు, మహిళా పార్లమెంటేరియన్లు నిర్వహించిన నిరసన సందర్భంగా ఢిల్లీ పోలీసులు వారిని తోసివేయడం, వేధింపులకు గురి చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ భయపడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని అభిషేక్ బెనర్జీ విమర్శించారు.
అయితే, ఒకే పాన్ నంబర్ గుజరాత్, బెంగాల్‌లో ఎలా ఉండగలదు? అని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అడిగారు. ఒకే వ్యక్తి పేరు 10 పోలింగ్ స్టేషన్లలో ఎలా ఉంటుంది?.. ఒక ఇంట్లో 100 మంది ఓటర్లు ఎలా ఉంటారు? లాంటి ప్రశ్నలు సంధించారు. ఎన్నికల కమిషన్ నిజంగా ఓటర్ల జాబితాలో లోపాలను సరి చేయాలనుకుంటే.. ముందుగా ప్రధాని మోడీ, కేబినెట్ రాజీనామా చేసిన తర్వాత లోక్‌సభను రద్దు చేసి.. దేశవ్యాప్తంగా SIR జరపాలని అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com