MP Urination Case: బిగ్‌ ట్విస్ట్‌... తప్పు తెలుసుకున్నాడు... వదిలేయండి

MP Urination Case: బిగ్‌ ట్విస్ట్‌... తప్పు తెలుసుకున్నాడు... వదిలేయండి
మధ్యప్రదేశ్‌ మూత్ర విసర్జన కేసులో కీలక మలుపు... నిందితుడిని వదిలేయాలని ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి... తాను తప్పు తెలుసుకున్నాడన్న రావత్‌

మధ్యప్రదేశ్‌లో తీవ్ర రాజకీయదుమారం రేపిన మూత్రవిసర్జన ఘటన కొత్తమలుపు తిరిగింది. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విడుదల చేయాలని బాధితుడు దశ్మత్ రావత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. నిందితుడు తప్పు తెలుసుకున్నాడని పేర్కొన్నాడు. పశ్చాతాపం చెందుతున్న వ్యక్తిని విడిచి పెట్టాలని రావత్‌ కోరాడు. అతడు చేసింది తీవ్రమైన తప్పే కావచ్చని, కానీ జరిగిందేదో జరిగిపోయిందని, అతడ్ని విడిచిపెట్టాలని మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రావత్‌ కోరాడు.


మరోవైపు ప్రవేశ్‌ శుక్లా ఇంటిని కూల్చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సత్వర న్యాయం పేరుతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఒక వ్యక్తి చేసిన తప్పుకు అతడి కుటుంబాన్ని రోడ్డుపాలు చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తన కొడుకు చేసిన పనికి అతడిని కఠినంగా శిక్షించాలని నిందితుడు ప్రవీశ్‌ శుక్లా తండ్రి రమాకాంత్‌ శుక్లా అన్నారు. అయితే తన కుమారుడు చేసిన నేరానికి..ప్రభుత్వం తన ఇంటిని కూల్చివేసిందని, ఇప్పుడు తన కుటుంబ సభ్యులంతా రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్డోజర్‌ న్యాయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చట్ట ప్రకారం విచారణ జరగనివ్వాలని, తన కొడుకు తప్పు చేశాడని తేలితే అతడికి కఠిన శిక్ష పడాల్సిందే అని రమాకాంత్‌ అన్నాడు. కానీ తన ఇంటిని కూల్చేస్తే ఆడవాళ్లు ఎక్కడ తలదాచుకోవాలని... వృద్ధురాలైన తన తల్లి పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. తన ఇంట్లో 80 ఏళ్ల తల్లి, ముగ్గురు మనవరాళ్లు, కోడళ్లు ఉన్నారని వారంతా ఎక్కడ ఉండాలని రమాకాంత్‌ ప్రశ్నించారు.


ప్రభుత్వం కూల్చిన ఇల్లు ప్రవేశ్‌ది కాదని, అతడి స్థలం కూడా కాదని, తాత తండ్రుల నుంచి తనకు వారసత్వంగా సంక్రమించిందని రమాకాంత్‌ చెప్పారు. ఎంత చెప్పినా ప్రభుత్వ యంత్రాంగం వినిపించుకోకుండా తన ఇల్లును కూల్చేశారని తెలిపారు. బుల్డోజర్‌తో ఇంటిని కూల్చడాన్ని కోల్‌ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన సభ్యులు సైతం ఖండించారు. ఇంటిని కూల్చటం చాలా తప్పు..అన్నారు. ‘ఒక పక్షి గూడు దెబ్బ తింటేనే మేం తట్టుకోం. అలాంటిది ప్రభుత్వం అధికారుల్ని పంపి..మహిళలు, పిల్లలు ఉన్న ఇంటిని కూల్చేటం దారుణమని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గిరిజనుడైన దశ్మత్ రావత్ పై మూత్ర విసర్జనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో నిందితుడు ప్రవేశ్ రావత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై వివిధ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, దేశ భద్రతా చట్టాల కింద కేసు నమోదుచేశారు. సీఎం చౌహాన్ భోపాల్ లోని తన నివాసంలో బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పారు. బాధితునికి ఆరున్నర లక్షల ఆర్థిక సాయం అందించారు.

Tags

Next Story