Mukesh Ambani : ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు..

Mukesh Ambani : రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి మరోసారి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోన్న హర్‌కిసాన్‌దాస్ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అదే నంబరు నుంచి మూడు, నాలుగు కాల్స్ వచ్చాయి. దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ముంబయిలోని డీడీ మార్గ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నంబరు ఆధారంగా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గతేడాది ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్ హీరేన్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం విశేషం. దీంతో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com