Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపులు.. నిందితుడి అరెస్టు

రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు కాల్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆయన్ను అంతం చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు కాల్స్‌ వచ్చాయి. దీంతో సల్మాన్‌ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటున్నారు. అక్టోబర్‌ 30న సల్మాన్‌ను రూ. 2కోట్లు డిమాండ్‌ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంత సమయం క్రితం అరెస్ట్‌ చేశారు. కొద్దిరోజుల క్రితం రూ. 5 కోట్లు కావాలని బెదిరింపులకు దిగిన కూరగాయల వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గతంలో మాదిరే ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది. సల్మాన్‌ను చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన్ను ప్రాణాలతో వదిలేయాలంటే రూ. 2 కోట్లు ఇప్పించాలని మెసేజ్‌లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు బాంద్రాకు చెందిన ఆజం మహ్మద్ ముస్తఫాను అరెస్ట్‌ చేశారు. 2022 నుంచి ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి మెసేజ్‌లు సల్మాన్‌కు వచ్చాయి. ముంబైలోని బాంద్రా వెస్ట్‌ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని అతని నివాసానికి సమీపంలో ఉన్న ఒక బెంచ్‌పై కూడా సల్మాన్‌ను బెదిరిస్తూ ఒక లేఖ కనుగొనబడింది. అప్పట్నించి ఈ కేసులో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు.

1998లో ఒక సినిమా షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ కృష్ణ జింకలను వేటాడారు. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్‌ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్‌ వేటాడటం ఆ వర్గానికి చెందిన వారికి నచ్చలేదు. ఈ క్రమంలో సల్మాన్‌ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొని లారెన్స్‌ బిష్ణోయ్‌ ఒక గ్యాంగ్‌ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్‌పై హత్యాయత్నం కూడా చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి.

Tags

Next Story