Atal Setu: ప్రయాణించండి కానీ సెల్ఫీలు వద్దు

ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నఅటల్ సేతు (ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. భారత్‌లో అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతును జాతికి అంకితం చేసిన వెంటనే ప్రజలు ఈ బ్రిడ్జిపై తమ వాహనాలను నిలిపివేసి సెల్ఫీలు తీసుకుంటూ సీ వ్యూను ఆస్వాదిస్తున్నారు.
కొందరు బ్రిడ్జి పరిసర ప్రాంతాలను చూసేందుకు వెళుతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అటల్ సేతుపై ఆగి ఫొటోలు క్లిక్‌మనిపించడం చట్టవిరుద్ధమని ముంబై పోలీసులు హెచ్చరించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌పై ఆగి, ఫొటోలు తీసుకునేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
అటల్ సేతు చూడదగిన ప్రదేశమని తాము అంగీకరిస్తామని, అయితే ఈ ప్రతిష్టాత్మక వంతెనపై ఆగి ఫొటోలు తీయడం సరైంది కాదని, ఈ వంతెనపై నిలిచి హంగామా చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ముంబై పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రజలను హెచ్చరించారు.
ముంబయి- నవీ ముంబయిలను కలిపే అతిపెద్ద సముద్రపు వంతెన’ అటల్ సేతు’ ను జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 22 కిలోమీటర్లు పొడవుతో ఇది దేశంలోనే అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన. ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్‌ను దాటుతుంది. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి. రూ. 20 వేల కోట్లతో నిర్మించిన ఈ వంతెనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. ఇంతవరకూ ఈ దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టేది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com