Ratan Tata: రతన్ టాటా కు ప్రాణ హాని ఉందని బెదిరింపు కాల్స్..

వ్యాపారవేత్త రతన్ టాటాను బెదిరించిన వ్యక్తి ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఆ బెదిరింపు కాల్ చేసింది ఎంబీఏ చదువుకున్న వ్యక్తి అని నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తికి సిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ముంబయి పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. టాటా భద్రతను పెంచాలని.. లేదంటే ఆయనకు కూడా సైరస్ మిస్త్రీలాగే అవుతుందని పేర్కొన్నట్లు తెలిపాయి. సైరస్ మిస్త్రీ టాటా సన్స్ కు మాజీ చైర్మెన్ గా బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది ఆహ్మదాబాద్ నుంచి ముంబాయి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. రతన్ టాటాకు ఈ బెదిరింపులు ఈ వారం ఆరంభంలోనే రాగా ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు రతన్ టాటా భద్రతను పెంచారు. టాటా ఇంటి సమీపంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నిందితుడిని పుణెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. టెక్నికల్ సపోర్ట్ బృందం ద్వారా ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఆధారాలను సేకరించారు. ఆ వ్యక్తి కర్నాటకలో ఉన్నట్లు గుర్తించారు. అయితే అతను పుణెకు చెందిన వ్యక్తి అని తేల్చారు. పుణెలో అతని ఇంటికి వెళ్లిన పోలీసులు.. అతను 5 రోజుల నుంచి మిస్సింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
బోసారి పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి ఇంట్లోనే మరో వ్యక్తికి చెందిన ఫోన్‌ను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ ఫోన్‌తోనే ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి.. రతన్ టాటాను బెదిరించాడు. బెదిరింపు కాల్ చేసిన నిందితుడు ఇంజినీరింగ్ చదివి ఎంబీఏ చేశాడు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com