RAIN ALERT: ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ముంబైని అతలాకుతలం చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి దేశ ఆర్థిక రాజధానిని కుండపోత వర్షం ముంచెత్తుతోంది. భారీ వర్షంతో రహదారిపైకి వరద రావడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అంధేరి సబ్‌వేపై వాహనాల రాకపోకలను నిషేధించారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ధాటికి బాంద్రా ఫ్లై ఓవర్‌పై పోలీసు వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో బస్సులను వేరే మార్గాలకు మళ్లించారు.
ఇవాళ కూడా ముంబైలో భారీ వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై, దాని పక్కనే ఉన్న థానే జిల్లాకు IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాయ్‌గఢ్, రత్నగిరి, నాసిక్, పూణే, సతారా జిల్లాలతో సహా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తుండడం వలన ముంబైలో పలు చెట్లు కూలిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ముంబైలో బుధవారం 26 చెట్లు పడిపోవడం, 15 షార్ట్ సర్క్యూట్‌లు, ఐదు ఇళ్లు కూలిపోయిన ఘటనలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ముంబై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహారాష్ట్ర, దిల్లీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్ , మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు IMD భారీ నుంచి అతిభారీ వర్షపాతాలు నమోదయ్యే చాన్స్ ఉందని హెచ్చరికను జారీ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com