Munawar Faruqui Show : ఢిల్లీలో మునావర్ ఫారూఖీ షో రద్దు..

Munawar Faruqui Show : మునావర్ ఫారూఖీ షోకి ఢిల్లీ పోలీసుల బ్రేక్ వేశారు. రేపు జరగాల్సిన కామెడీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. మునావర్ కామెడీ షో వల్ల మత సామరస్యం దెబ్బతింటుందని, అందుకే అనుమతి నిరాకరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మునావర్ ఫారూఖీ తన షోలో హిందూ దేవుళ్లను అవహేళన చేశాడని, హైదరాబాద్‌లో ఘర్షణలకు ఆయనే కారణమని వీహెచ్‌పీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రేపు ఢిల్లీలోని కేదార్‌నాథ్ సాహ్నీ ఆడిటోరియంలో జరగాల్సిన మునావర్ షో అనుమతిని రద్దు చేశారు.
ఢిల్లీలో మునావర్ షో జరిగితే గనక తాము కచ్చితంగా నిరసన తెలుపుతామని విశ్వహిందూపరిషత్ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. పైగా గతేడాది నుంచి మునావర్ షోలు పోలీసులకు శాంతిభద్రతల సమస్యగా మారాయి. అందుకే, సరిగ్గా గత వారం బెంగుళూరులో జరగాల్సిన మునావర్ షో కూడా రద్దు అయింది. అనారోగ్యం కారణంగా బెంగళూరు షో చేయలేకపోయానని చెప్పినప్పటికీ.. కర్నాటక ప్రభుత్వమే రద్దు చేయించింది.
డోంగ్రీ టు నో వేర్ షోకు బెంగుళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పైగా మునావర్‌కు వ్యతిరేకంగా జైశ్రీరామ్ సేన బెంగుళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. శ్రీరాముడు, సీతపై మునావర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు శ్రీరామ్ సేన కంప్లైంట్ ఇచ్చింది. గత ఏడాది నవంబర్‌లోనూ బెంగుళూరులో మునావర్ షోకు అనుమతి దక్కలేదు. తాజాగా ఢిల్లీ పోలీసులు సైతం మునావర్ షోకు అనుమతి ఇవ్వలేదు.
గతంలో మునావర్ హిందూ దేవతల్ని అవమానించేలా తన షోలో కామెడీ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్నుంచి ఆయన షోను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మునావర్ షోను రద్దు చేయాలంటూ ప్రతి రాష్ట్రంలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ షోను రద్దు చేయకుంటే ఎంతకైనా తెగించేందుకు సిద్ధమంటూ వీహెచ్‌పీతోపాటు, భజరంగ్ దళ్ సభ్యులు చెబుతున్నారు. అందుకే, మొన్న బెంగళూరు, ఇవాళ ఢిల్లీ సహా అనేక రాష్ట్రాలు మునావర్ షోకు అనుమతిని నిరాకరిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com