UCC: యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి పోరు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చేస్తున్న ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని ముస్లిం సంస్థలు నిర్ణయించాయి. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కు వ్యతిరేకంగా చట్టపరంగా, రాజకీయ పరంగా పోరాడతామని స్పష్టం చేశాయి. UCCని అమలు చేస్తే అది కేవలం ముస్లింలపైనే కాకుండా మొత్తం సమాజంపై ప్రభావం చూపుతుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెలిపింది. ఉమ్మడి పౌర స్మృతి కేవలం ముస్లింల సమస్య కాదని, ప్రజలందరి సమస్యని IUML కేరళ అధ్యక్షుడు పానక్కాడ్ సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ అన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఏకం చేసి న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతామని ఆయన తెలిపారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకు బీజేపీ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్‌ను సాధనంగా వాడుకుంటుందని IUML సీనియర్ నేత, ఎమ్మెల్యే పీకే కున్హాలికుట్టి ఆరోపించారు.
ఉమ్మడి పౌరస్మృతిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తోపాటు సమస్తా కేరళ జమియ్యతుల్ ఉలమా, కేరళ నద్వతుల్ ముజాహిదీన్, జమాతే ఇస్లామీ హింద్, ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ, ముస్లిం సర్వీస్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. ఇవాళ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలోనూ యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ప్రజలను విభజించేందుకే బీజేపీ యూసీసీని తీసుకువస్తోందని, ప్రస్తుతం యూసీసీ అవసరమే లేదని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ విమర్శించారు. ప్రస్తుతం ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నియమించిన లా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పిందని.. అయినా దీన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేరళలోని అధికార పార్టీ కూడా UCCను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మతపర విభజనను మరింతగా పెంచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. భారత్‌లో బహుళత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాలను వ్యతిరేకిద్దామని, ప్రజాస్వామ్య సంస్కరణలకు మద్దతు ఇద్దామని విజయన్ ట్వీట్ చేశారు. కేరళ సిఎం వైఖరిపై బీజేపీ కేరళ అధ్యక్షుడు కె సురేంద్రన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం ముస్లిం పార్టీగా మారిపోయిందని... ముస్లింల ఓట్ల కోసమే విజయన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు.
ఇటీవల ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ... ఒక దేశం రెండు చట్టాలపై నడవదని స్పష్టం చేశారు. యూనిఫాం సివిల్ కోడ్ రాజ్యాంగంలో భాగమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం సమాన హక్కుల గురించి మాట్లాడుతుందని.. సుప్రీంకోర్టు కూడా యూసీసీని అమలు చేయాలని కోరిందని మోదీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com