Pm Modi : ట్విటర్‌లోనే స్వాగతాలు, వ్యంగ్యాస్త్రాలు

రాజస్థాన్ ముఖ్యమంత్రి అలక పూనారు. గురువారం ప్రధాని హాజరయ్యే కార్యక్రమంలో తన ప్రసంగాన్ని ప్రధాని కార్యాలయం చివరి నిమిషంలో తొలగించిన నేపథ్యంలో తాను ప్రధానిని నేరుగా ఆహ్వానించలేక పోతున్నానంటూ సీఎం అశోక్ గహ్లోత్ వెటకారం చేశారు. తమ రాష్ట్రానికి వచ్చే ప్రధానిని తాను కేవలం ట్విటర్ ద్వారానే ఆహ్వానించగలనని ఒక పోస్ట్ పెట్టారు. అయితే కార్యక్రమములో ప్రసంగించిన మోదీ మాత్రం అనారోగ్యం కారణంగానే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రకటించారు.
శిఖర్ వేదికగా కిసాన్ సమ్మాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు రాజస్థాన్ వెళ్లారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అంతకుముందు ఈ కార్యక్రమానికి షెడ్యూలును విడుదల చేసింది ప్రధాని కార్యాలయం. కానీ అందులో తన పేరు లేకపోవడంతోనే ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లడం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇదే ట్విట్టర్ వేదికగా ప్రధానికి ఆహ్వానాన్ని తెలుపుతున్నానని అన్నారు. అలాగే తమ డిమాండ్లను కూడా ఇక్కడే తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈసారైనా వాటిని నెరవేర్చాలని కోరారు.
దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ప్రోటోకాల్ ప్రకారం మొదట షెడ్యూలులో ఆహ్వాన ప్రసంగం ఉండేదని అయితే సీయం కార్యాలయం నుండి ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలుపడం తోనే పేరును తొలిగించామని రిప్లై ఇచ్చింది. ప్రధాని గత పర్యటనల్లో వచ్చినట్టుగానే ఇప్పుడు కూడా రావాలని కోరింది. అభివృద్ధి కార్యక్రమాల ఫలకాల మీద కూడా సీయం పేరుని చేర్చడం జరిగిందని చెప్పింది.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటించడం గత ఆరు నెలల్లో ఇది ఏడోసారి. అయితే ఇటీవల మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ రాజస్థాన్ ప్రస్తావన తీసుకురావడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై గహ్లోత్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని కార్యక్రమంలో ఆయన ప్రసంగాన్ని తొలగించారంటూ వార్తలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com