Stomach: కడుపు కాదది కార్ఖానా

యువకుడి కడుపులో ఇనుప మేకులు, నట్లు, బోల్టులు..

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో వైద్యులే కంగుతినే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించిన సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రి వైద్యులు.. అతని కడుపులో బయటపడిన వస్తువులను చూసి కంగుతిన్నారు. అతని పొట్టలో మొత్తం మేకులు, సూదులు, తాళం చెవులు, నట్లు, బోల్టుల లాంటి లోహాపు వస్తువులు బయటపడటంతో అవాక్కయ్యారు.

వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఓ యువకుడు ఇటీవల జైపుర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతడికి ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ లాంటి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అతడి పొట్టలో ఇనుప వస్తువులు పేరుకుపోయినట్లు గుర్తించారు. వాటిలో కొన్ని పెద్ద పేగులోకి వెళ్లిపోయినట్లు గమనించారు. దాంతో వైద్య బృందం అతడికి లాప్రోస్కోపీ, కొలనోస్కోపీ నిర్వహించింది.

దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి ఆ వస్తువులను తొలగించారు. రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. బాధిత యువకుడి మానసిక స్థితి సరిగ్గా లేదని, ఈ క్రమంలోనే ఇనుప మేకులు, సూదులు వంటి మింగాడని సర్జరీకి ముందు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పి రావడంతో తొలుత ఆళ్వార్‌లోని ఆస్పత్రికి తరలించామని, అనంతరం జైపూర్‌కు తీసుకొచ్చామని చెప్పారు.

Tags

Next Story