NARAVANE: నరవణె పుస్తకం వెనుక కుట్ర?

మాజీ సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ఆత్మకథ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం రేపుతోంది. రక్షణ శాఖ నుండి ఎటువంటి అధికారిక ప్రచురణ అనుమతులు రాకముందే ఈ పుస్తకం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి పలు దేశాల్లోని ఆన్లైన్ విక్రయ వేదికలపై ప్రత్యక్షమవ్వడం కలకలం సృష్టించింది. ఇది కేవలం సాధారణ పైరసీ చర్య కాదని, పక్కా ప్రణాళికతో అంతర్జాతీయ మార్కెట్లోకి పుస్తకాన్ని చేరవేసేలా ఒక వ్యవస్థీకృత లీక్ ఆపరేషన్ జరిగినట్లు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు దర్యాప్తు సంస్థలు ఇప్పుడు రంగంలోకి దిగాయి.
ప్రభుత్వ అనుమతులు లభించకముందే ఈ పుస్తకానికి 13 అంకెల అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (ISBN) కేటాయించడం దర్యాప్తు బృందాలను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా అన్ని చట్టపరమైన అనుమతులు పూర్తి చేసుకుని మార్కెట్లోకి వచ్చే పుస్తకాలకే ఈ నంబరు కేటాయిస్తారు. రక్షణ శాఖ పరిశీలనలో ఉన్న పుస్తకానికి ఈ నంబరు ఎలా వచ్చిందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రచురణ సంస్థ పెంగ్విన్ ఇండియాను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. విదేశీ మార్కెట్లకు ఈ పుస్తక కాపీలను పంపడానికి జరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఆర్థిక లావాదేవీలను పోలీసులు ప్రస్తుతం నిశితంగా ట్రాక్ చేస్తున్నారు. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణ వంటి దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశాలను నరవణె ఈ పుస్తకంలో ప్రస్తావించారు. వీటిపై రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రచురణను నిలిపివేయాలని గతంలోనే ఆదేశించింది. అయితే, ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని ప్రదర్శించడంతో ఈ లీకేజీ ఉదంతం ఒక్కసారిగా బయటపడింది. దీనిపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పెంగ్విన్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా విచారణ వేగవంతమైంది. ఈ వ్యవహారంపై స్పందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించినప్పటికీ, నిబంధనల ఉల్లంఘనపై అంతర్గతంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. దేశ భద్రతా రహస్యాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో, ఈ లీకేజీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
