Narendra Modi: 24 గంటల్లో మూడవసారి ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం..

Narendra Modi: 24 గంటల్లో మూడవసారి ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం..
Narendra Modi: ఉక్రెయిన్‌లో పరిస్థితులు, భారతీయుల తరలింపు, భద్రతపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు.

Narendra Modi: 24 గంటల్లో 3వ సారి మన ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు, భారతీయుల తరలింపు, భద్రతపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉక్రెయన్‌ సరిహద్దు దేశాలకు నలుగురు మంత్రుల్ని పంపి.. అక్కడి నుంచే రెస్క్యూ ఆపరేషన్‌ మొత్తం పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో మాల్డోవా సరిహద్దు నుంచి భారతీయుల తరలింపు బాధ్యత సింధియా చూస్తున్నారు.

రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ మీదుగా ప్రత్యేక విమానాలు భారత్‌ చేరుకోనున్నాయి. హర్దీప్‌ సింగ్ పూరీ కూడా దూతగా వెళ్లారు. ఆయన హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ నుంచి కోర్డినేట్‌ చేస్తారు. VK సింగ్‌ పోలెండ్‌ నుంచి, కిరణ్‌ రిజుజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా నుంచి భారతీయుల తరలింపును స్వయంగా సమన్వయం చేసుకుంటారు.

వీరంతా ఆయా దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుని సహాయ చర్యల బాధ్యతల్ని చూస్తారు. ఇప్పటికి 6 ఫ్లైట్లలో భారత్‌కి 1396 మంది చేరుకున్నారు. ఇంకా ఉక్రెయిన్‌లో 8 వేల మంది మంది భారతీయులు ఉన్నట్టు విదేశాంగ శాఖ చెప్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న భారత ప్రభుత్వం, యుద్ధం ఆపాలంటూ రష్యాపై ఎందుకు అంత ఒత్తిడి తేవడం లేదని భారత్‌లో ఆ దేశ రాయబారి ప్రశ్నించారు.

నిజానికి ఇప్పుడు భారత్‌ ఏవైపూ స్పష్టంగా మొగ్గు చూపలేని పరిస్థితుల్లో ఉంది. పశ్చిమ దేశాల నుంచి సరికొత్త మిత్రుడైన ఉక్రెయిన్‌తో దోస్తీని కొనసాగించడం, అదే సమయంలో చిరకాల నేస్తంగా ఉన్న రష్యాతో సంబంధాల్ని నిలబెట్టుకోడం రెండూ భారత్‌కు ముఖ్యమే. అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 24 గంటల్లో 3 సార్లు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక నిర్వహించడానికి రెండు దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూనే.. వీలైనంతగా నష్ట నివారణ చర్యలు చేపట్టే ఉద్దేశంతో వ్యవహరిస్తోంది.

విదేశాంగ విధానం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఈ యుద్ధ పరిస్థితుల్ని డీల్‌ చేస్తోంది. రష్యా బారత్‌కు రక్షణ పరికరాల సరఫరాలో అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. యుద్ధ ట్యాంక్‌లు, మిసైళ్లు, సబ్‌మెరైన్లు ఇలా ఎన్నింటినో రష్యా నుంచే భారత్‌ కొనుగోలు చేసింది. ఇవన్నీ ఇప్పుడు మన అమ్ముల పొదిలో కీలక అస్త్రాలుగా ఉన్నాయి. అమెరికా నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా కాదని 2018లో మిసైస్‌ సిస్టమ్‌ కోసం 5 బిలియన్‌ డాలర్ల డీల్‌ కుదుర్చుకుంది.

రక్షణరంగంలోనే కాదు వాణిజ్యం, టెక్నాలజీలోనూ ఇచ్చిపుచ్చుకునే స్నేహం రెండు దేశాల మధ్య ఉంది. అలాగే రష్యా కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అనేక సందర్భాల్లో మనకు బాసటగా నిలిచింది. ఈ ద్వైపాక్షిక బంధాలు పటిష్టంగా ఉన్నందున యుద్ధం విషయంలో భారత్‌ తటస్థ వైఖరిని అవలంభించింది. అటు, ఉక్రెయిన్‌తో కూడా క్రమంగా వాణిజ్య బంధం బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఏదో పక్షాన నిలిచే పరిస్థితి లేనందునే జాగ్రత్తగా డీల్‌ చేయాల్సి వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story